వైఎస్‌ షర్మిల పీసీసీ బాధ్యతల స్వీకరణకు అంతా సిద్ధం

-

ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు వైఎస్‌ షర్మిల సిద్ధమయ్యారు.హైద్రాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న ఆమె ఇడుపులపాయలోని స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ అభిమానులు,కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆమెకు ఇడుపులపాయవద్ద ఘనస్వాగతం పలికారు. రాత్రికి ఇడుపుల పాయలోనే ఉండనున్న షర్మిల ఆదివారం ఉదయం తన తండ్రి సమాధి వద్ద ప్రార్ధనలు పూర్తి చేసుకుని విజయవాడకు చేరుకుంటారు. అనంతరం పార్టీ పెద్దల సమక్షంలో పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు తీసుకుంటారు. అనంతరం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి….షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఖండువా వేసుకోనున్నారు. ఇంకా పలువురు ప్రముఖ నేతలు ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర పేరుతో సుదీర్ఘ దూరం ప్రయాణించారు షర్మిల. అయితే కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి అధికారంలోకి వచ్చేందుకు సాయపడ్డారు. ఆ తరువాత వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనంచేశారు.మొదట రాజ్యసభ సీటు ఆశించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని భావించింది. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని ఆదేశించింది. అయితే గత రెండు రోజుల క్రితం కుమారుడి నిశ్చితార్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుక తరువాత ప్రత్యక్ష రాజీయాల్లో క్రియాశీలకంగా బాధ్యతలు చేపట్టాలని భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు పార్టీ నేతలు.ఏపీలో ఆమె రాజకీయ పయనం ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ముందు ఉన్న సవాళ్ళను అధిగమిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారా అని చర్చలు నడుస్తున్నాయి.ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందని కూడా చర్చలు జరుగుతున్నాయి.

షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్‌లు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బాటలోనే పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు నేపథ్యంలో టీడీపీకి చెందిన పలువురు సీనియర్‌లు సీటు కోల్పోయే అవకాశం ఉంది.టిక్కెట్‌ రాదని తెలిసి పలువురు టీడీపీ నేతలు అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్నట్లు సమాచారం.వారందరూ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరవచ్చనే అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.మొత్తానికి షర్మిల రాకతో ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారబోతోందన్న మాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version