ఏపీలో దొంగ ఓట్లు..రిజల్ట్ తారుమారు.?

-

ఏపీలో దొంగ ఓట్ల కలకలం చెలరేగుతూనే ఉంది..ఈ దొంగ ఓట్లని అధికార వైసీపీ పెద్ద ఎత్తున నమోదు చేసిందని గ్రామ సచివాలయ, వాలంటీర్ల సహకారంతో టి‌డి‌పి సానుభూతిపరుల ఓట్లు తొలగించడం, అలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారని టి‌డి‌పి ఆరోపణలు చేస్తూ వచ్చింది. అసలు ఈ దొంగ ఓట్లు సృష్టించేది టి‌డి‌పి అని ఇప్పుడు వాటిని తొలగిస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అయితే ఈ దొంగ ఓట్ల అంశంపై టి‌డి‌పి నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఉరవకొండలో టి‌డి‌పి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇచ్చిన ఫిర్యాదుతో దొంగ ఓట్ల విషయంలో కొందరు అధికారులని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. తాజాగా రఘురామకృష్ణంరాజు ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లకు సంబంధించిన అంశంపై లేఖ రాశారు. తాజాగా ఎన్నికల సంఘం రిప్లై ఇస్తూ.. ఒకే డోర్ నెంబర్‌ ఉన్న ఇళ్లలో 24 లక్షల 61 వేల 676 ఓట్లు ఉన్నాయని ఈసీ తెలిపింది. దొంగ ఓట్లు భారీగా ఉన్నట్లు తేలడంతో వాటి ఏరివేతకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని రఘురామకు పంపిన లేఖలో ఈసీ వివరించింది.

అయితే జీరో నెంబర్, బోగస్ ఇంటి నెంబర్లతో 2,51,767 ఓట్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం లెక్క తేల్చింది. ఒకే డోర్ నెంబర్‌లో 10 ఓట్లకు పైగా దాదాపు లక్షా 57,939 ఇళ్లు ఉన్నాయని ఈసీ అధికారులు వెల్లడించారు. మొత్తానికి ఈ దొంగ ఓట్ల వ్యవహారం బయటపడటంతో ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ నడుస్తోంది.

ఇక ఎన్నికల సంఘం ఎంతమేర ఈ దొంగ ఓట్లకు చెక్ పెడుతుందనేది చెప్పలేని పరిస్తితి. స్థానిక అధికారులతోనే ఈ ఓట్లు తీసేయాలి. మరి అంత ఈజీగా జరిగే ప్రక్రియ అంటే చెప్పలేం. చూడాలి మరి ఈ దొంగ ఓట్లు ఎన్నికలని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version