బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య చీకటి ఒప్పందం ఉందని మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి రహస్య
సమావేశం అయ్యారని మండిపడిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న
వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటని మండిపడ్డారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగ చాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ఆరోపించారు.
ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే
బయటపెట్టాలన్నారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో
విద్యార్ధులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం సమయం దొరకడం క్షమించలేని ద్రోహం అన్నారు.