మహేశ్వరం ‘కారు’లో సెగలు..హస్తం గూటికి తీగల?

-

అధికారం ఉంది కదా అని ఎక్కువ ఆశపడితే చిక్కులు తప్పవని మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో రుజువు అవుతుంది.. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి.. ఫుల్ గా ఎమ్మెల్యేలు ఉన్నా సరే.. అయినా సరే ప్రతిపక్షాలని లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్.. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇక ఇలా చేయడం వల్ల టీఆర్ఎస్ బలం పెద్దగా పెరగకపోగా, ఇంకా ఆ పార్టీకే డ్యామేజ్ అవుతుంది.

మొదట్లో ఎంత అసంతృప్తి ఉన్న పెద్దగా బయటపడని నేతలు.. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరగడం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పుంజుకుంటున్న నేపథ్యంలో బయటకొచ్చి మరీ..జంపింగ్ ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో రచ్చ నడుస్తూనే ఉంది. కాంగ్రెస్, టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ లో పోటీ చేసి ఓడిపోయిన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

ఈ పోరు వల్ల టీఆర్ఎస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగేలా ఉంది.. ఇప్పటికే ఈ పోరు వల్ల కొందరు నేతలు టీఆర్ఎస్ వీడటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అశ్వరావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇదే క్రమంలో మహేశ్వరంలో సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డి సైతం టీఆర్ఎస్ ని వీడటం దాదాపు ఖాయమే అని తెలుస్తోంది.

గతంలో టీడీపీలో పనిచేసిన తీగల.. 2014లో మహేశ్వరం నుంచి టీడీపీ తరుపున గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చారు.. ఇక 2018లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి, కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయారు. నెక్స్ట్ సబితా టీఆర్ఎస్ లోకి వచ్చారు..అలాగే ఆమెకు మంత్రి పదవి దక్కింది. దీంతో అప్పటినుంచి తీగల అసంతృప్తిగానే ఉన్నారు.

అలాగే మహేశ్వరంలో తీగలకు గాని, తీగల వర్గానికి గాని పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదు. నియోజకవర్గంలో  తీగల, సబితా వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కూడా తీగల.. సబితాపై విమర్శలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, చెరువులు, స్కూల్ జాగాలను వదలడం లేదని ఆరోపించారు. తమ పార్టీ నుండి సబిత ఎమ్మెల్యేగా గెలవలేరని విమర్శించారు. అంటే మహేశ్వరం టీఆర్ఎస్ టికెట్ సబితాకే దక్కుతుందని తీగల పరోక్షంగా చెప్పేశారు.. ఈ క్రమంలోనే తీగల సైతం తన రాజకీయ భవిష్యత్ చూసుకునే క్రమంలో.. కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తీగలని రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.. దీంతో తీగల కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మొత్తానికి ఆధిపత్య పోరు టీఆర్ఎస్ కొంపముంచేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version