అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో హైడ్రా తన దూకుడును కొనసాగిస్తునే ఉన్నది.తాజాగా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు.డిటొనేటర్లను వాడి ఆ భవంతిని కూల్చేశారు.సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్‌షాయిపేట మల్కాపూర్ పెట్ట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ఇటీవల హైడ్రా ఫోకస్ పెట్టింది.
కొండాపూర్ మండల రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల నివేదిక ఆధారంగా కలెక్టర్ ఆ కట్టడాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం భారీ బందోబస్తు మధ్య తహసీల్దార్ అనిత, ఇతర అధికారులు ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. అయితే, ఆ భవంతి నేలమట్టం అయ్యే సమయంలో రాయి తగిలి అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్ తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆక్రమణల విషయంలో కఠినంగా ఉంటామని హైడ్రా అధికారులు తెలిపారు.