తెలంగాణలో కేసీఆర్..ఈటల రాజేందర్..ఈ ఇద్దరు ఒకప్పుడు మిత్రులు..ఇప్పుడు రాజకీయ శత్రువులు అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు సహచరులుగా కలిసిమెలిసి రాజకీయం చేసేవారు. కానీ తర్వాత కొన్ని కారణాలతో ఈటలని పార్టీలోకి వెళ్ళేలా కేసిఆర్ చేయడం..ఈటల సైతం బిఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..బిజేపి లో చేరి మళ్ళీ హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచిన సంగతి తెలిసిందే.
ఇక హుజూరాబాద్ లో ఈటలని ఓడించడానికి కేసిఆర్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఎలాగైనా కేసిఆర్‌కు చెక్ పెట్టాలని ఈటల రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ లో పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే హుజూరాబాద్ బరిలో బిఆర్‌ఎస్ తరుపున కౌశిక్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. ఉపఎన్నిక సమయంలోనే కౌశిక్ కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్ లోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యారు. నెక్స్ట్ ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు.
అయితే మళ్ళీ హుజూరాబాద్ బరిలో ఈటల దిగుతారా? లేక గజ్వేల్ లో పోటీ చేస్తారా? అనేది క్లారిటీ రావడం లేదు. ఈటల పోటీ చేయాలంటే బిజేపి అధిష్టానం డిసైడ్ చేయాలి. అధిష్టానం పర్మిషన్ ఇస్తే..హుజూరాబాద్ లో ఈటల భార్య, గజ్వేల్ లో ఈటల పోటీ చేస్తారు. కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది..బిఆర్‌ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిన కేసిఆర్..నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ ఉంది. కాకపోతే ముందు అసెంబ్లీ ఎన్నికలే జరుగుతాయి కాబట్టి కేసిఆర్..అసెంబ్లీ స్థానంలోనే పోటీ చేసే ఛాన్స్ ఉంది..మళ్ళీ గజ్వేల్ నుంచే పోటీ చేయవచ్చు. అటు ఈటల సైతం బిజేపి నుంచి పోటీ చేస్తే పోరు రసవత్తరంగా మారుతుంది. చూడాలి మరి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో?