తెలుగు భాషను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరీపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. నవతరానికి తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మాతృభాష విలువ తెలియజేయాలని అధికారులకు నొక్కి చెప్పారు. తెలుగు తియ్యదనాన్ని భావితరాలకు అందించాలని చెప్పారు.
నిత్య వ్యవహారాల్లో తెలుగుకు పట్టం కడితేనే తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన తెలుగు భాషకు ప్రమాదం పొంచి ఉందని గుర్తుచేశారు. భావితరాలకు తెలుగు భాష విలువ తెలియాలంటే ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రులు తెలుగులోనే మాట్లాడటం నేర్పించాలని సూచించారు. ఈ మధ్యకాలంలో తెలుగు వారు మాతృభాషలో మాట్లాడుకోవడం మానేశారని వివరించారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలు, జనసేన అభిమానులు సమర్థిస్తున్నారు.