ప్రశాంతమైన వాతావరణం ఉండే కోనసీమలో రాజకీయ రగడ రగులుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో కోనసీమలో మూడు ప్రధాన పార్టీలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రాష్ట్రంలో టిడిపి, వైసీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది..కానీ కోనసీమలో జనసేనకు బలం ఉంది. దీంతో అక్కడ త్రిముఖ పోరు ఉంది. అయితే టిడిపి-జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నాయి. అదే జరిగితే కోనసీమలో వైసీపీకి పెద్ద రిస్క్ అని చెప్పవచ్చు.
అయితే పొత్తుకు చెక్ పెట్టి మళ్ళీ కోనసీమలో వైసీపీకి ఆధిక్యం తీసుకొచ్చేలా జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ఆయన అమలాపురంలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమానికి బటన్ నొక్కుతారు. ప్రజలకు పథకాలు ఇవ్వడమే కాదు..రాజకీయంగా కోనసీమలో వైసీపీ పరిస్తితి ఎలా ఉందో తెలుసుకుని, అక్కడ మళ్ళీ పట్టు సాధించేలా దిశానిర్దేశం చేయనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రామచంద్రాపురం, రాజోలు, మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం సీట్లు ఉన్నాయి.
గత ఎన్నికల్లో మండపేట టిడిపి, రాజోలు జనసేన గెలుచుకున్నాయి. మిగిలిన ఐదు సీట్లు వైసీపీ గెల్చుకుంది. ఈ ఐదు సీట్లు గెలవడానికి ప్రధాన కారణం జనసేన ఓట్లు చీల్చడం. ఆ ఐదు సీట్లలో టిడిపిపై వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే..జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. అంటే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి గెలుపు రిస్క్ అయ్యేది.
అయితే ఇప్పుడు టిడిపి-జనసేన పొత్తు దిశగా వెళుతున్నాయి. కానీ వైసీపీ బలం తగ్గకుండా చూసుకునేలా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. పొత్తులో సీట్ల పంపకాలపై రచ్చ జరిగే ఛాన్స్ ఉంది. టిడిపికి సీటు జనసేన శ్రేణులు పూర్తిగా సహకరించకపోవచ్చు..అలాగే జనసేనకు సీటు ఇస్తే టిడిపి శ్రేణుల సపోర్ట్ దక్కకపోవచ్చు. దీని వల్ల మళ్ళీ వైసీపీకే బెనిఫిట్ అవుతుంది. మొత్తానికి మళ్ళీ కోనసీమలో వైసీపీ ఆధిక్యం సాధించే ఛాన్స్ ఉంది.