పవన్ చెప్పిందే.. జగన్ తు.చ. తప్పకుండా చేశాడు..!

-

ఏపీ రాజకీయాల్లో ఇసుక తుపాన్ కొనసాగుతోంది. కొన్నిరోజులుగా ఏపీలో ఇసుక సమస్యపై పోరాడుతున్నాయి. మొన్ననే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ చేశారు. అంతకుముందు నారా లోకేశ్ ఇసుక దీక్ష చేశారు. తాజాగా చంద్రబాబు కూడా ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. అయితే ఇసుక సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఇటీవల పవన్ కల్యాణ్ ఇసుక విషయంపై గవర్నర్ ను కలిసి ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఏముందో అప్పట్లో ఎవరికీ తెలియలేదు. కానీ తాము గవర్నర్ కు ఇచ్చిన నివేదికలోని పరిష్కార మార్గాలనే ఇప్పుడు జగన్ సర్కారు పాటిస్తోందట. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. ఇసుక కొరతపై గవర్నర్‌కు 18 పాయింట్లతో నివేదిక ఇచ్చామని… ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వారిపై గూండా చట్టం, జైలుశిక్ష విధించాలని పెట్టామని పవన్ వివరించారు. తాము గవర్నర్ వద్ద ప్రస్తావించిన అంశాన్నే నిన్న ప్రభుత్వం ఆమోదించిందని పవన్ గుర్తు చేశారు.

అంటే పవన్ కల్యాణ్ మాటలను వైసీపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నమాట. ఈ విషయంలో క్రెడిట్ కొట్టేసేందుకు పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించి ఉండొచ్చు. కానీ ఆ మాట చెప్పడం ద్వారా విపక్షాల మాటలకు ఈ ప్రభుత్వం గౌరవం ఇస్తుందన్న వాదన కూడా తలెత్తుతుంది. మొత్తానికి ఇసుక పుణ్యమా అని ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రోజూ నేతల మధ్య హాట్ హాట్ విమర్శలు సాగుతున్నాయి.

ఇసుకతో పాటు తెలుగు మాధ్యమం ఎత్తివేత అంశం కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయంలో టీడీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం తెలుగు పై గట్టిగానే వాణి వినిపిస్తున్నారు. మట్టిలో కలిసిపోతారనే మాటను తాను ఆవేశంలో అనలేదని.. తెలుగుభాషను మీరు అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని మళ్లీ చెబుతున్నా అంటూ అదే డైలాగ్ పునరుద్ఘాటించారు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఇంగ్లీష్ మీడియంపై మాత్రం జగన్ వెనక్కు తగ్గడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news