దశాబ్ద కాల స్వప్నం ఫలిచింది.. పదేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం అందింది.. తమ కష్టాలను, కన్నీళ్లను తుడిచే నాయకుడు తమను పాలించాలని ప్రజలు ఇచ్చిన తీర్పుకు ప్రతిరూపం కళ్ల ముందు కదలాడింది.. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సరిగ్గా మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ సీఎంగా దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ సీఎం కావాలని ఏకపక్ష తీర్పు ఇచ్చారు. దీంతో ఆ పార్టీకి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దీంతో ప్రజలు తనపై బరువైన బాధ్యతను పెట్టారని జగన్ అన్నారు. అందులో భాగంగానే ఆయన సీఎంగా ఇవాళ ప్రమాణం చేశారు. అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహలం నడుమ నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణం చేసి బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ నూతన సీఎం జగన్‌కు పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు పోలీస్ బ్యాండ్ వాయిద్యంతో జాతీయ గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించగా, తిరిగి అదే గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం సీఎం జగన్ గవర్నర్‌కు వీడ్కోలు పలికారు.
కాగా జగన్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే నేత స్టాలిన్‌తోపాటు జగన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వైఎస్ విజయమ్మ, షర్మిళలు కార్యక్రమానికి విచ్చేశారు.