ఏసీ గదులను వీడి ఏఎఏఎస్ అధికారులు ఫీల్డ్ మీదకు వెళ్లాలని, గురుకులాలను పరిశీలించి ఒక రాత్రి అక్కడే బస చేయాలని సీఎం రేవంత్ సూచించిన విషయం తెలిసిందే. పలుమార్లు సీఎం ఈ విషయంపై మాట్లాడటంతో కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ స్పందించారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొని మట్టి తవ్విపోశారు.
శుక్రవారం ఉదయం జిల్లాలోని టేకులపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ కూలి పనులను స్వయంగా వెళ్ళి పరిశీలించిన కలెక్టర్.. కూలీలతో కలిసి పలుగు పార పట్టి కాసేపు మట్టి తవ్వి పోశారు.ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై వివరాలు సేకరించారు. జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ కల్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.