జగనే కాబోయే ఏపీ సీఎం.. వయా పాదయాత్ర…!

-

ఏపీలో చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డట్టే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలను గమనిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగనే సీఎం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇన్నిరోజులు ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నా.. కొన్ని రోజుల నుంచి మాత్రం ఒక్కసారిగా మారిపోయాయి. అందులోనూ వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర కూడా ఆయనకు ప్లస్ అయ్యే చాన్స్ ఉంది.

సీఎం చంద్రబాబు.. తను తీసుకున్న గోతుల్లో తానే పడుతున్నారు. దానికి నిదర్శనాలే వారం నుంచి ఏపీలో జరుగుతున్న పరిణామాలు. టీడీపీకి చెందిన ముఖ్య నేతలు టీడీపీని వీడి వైసీపీ బాట పడుతున్నారు. వాళ్లు టీడీపీని ఎందుకు వీడుతున్నారో సరైన వివరణ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు.. దాన్ని జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రుద్దే ప్రయత్నం చేయడం ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడటాన్ని సూచిస్తుంది.

తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ అధికారం కోసం ఎగబడ్డారు చంద్రబాబు. ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ.. ఏపీ పాలనను గాలికి వదిలేసి.. తెలంగాణలో మకాం వేసి అధికారం కోసం ఎన్నో ఎత్తులు వేశారు. కానీ.. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు కదా. చంద్రబాబు ఎత్తులను చిత్తు చేసి.. టీడీపీ, కాంగ్రెస్ ద్వయాన్ని ఓడించి.. చంద్రబాబును ఆంధ్రాకు తరిమేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదు. ఏపీలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.

ఏతావాతా ఇప్పుడు అర్థమయ్యేదేంటంటే.. ఏపీలో రాబోయే ఎన్నికల్లో సీఎం అయ్యే అవకాశాలు జగన్‌కే ఉన్నాయి. చంద్రబాబు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనని ఇప్పటికే కొన్ని సర్వేలు చెప్పాయి. ఏపీ ప్రజలు కూడా ఈసారి చంద్రబాబును ఘోరంగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు.

కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మనసును విని.. వాళ్లకు ఏం కావాలో క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు వైఎస్ జగన్. ఆనాడు వైఎస్సాఆర్ సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి ఎలా అధికారంలోకి వచ్చారో.. అదే ఇప్పుడు పునరావృతం అవనున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్ పాదయాత్ర కంటే కూడా ఇది ఎంతో పెద్దది. కొన్ని నెలల పాటు ఫ్యామిలీకి దూరంగా ప్రజల మధ్య ఉంటూ వాళ్ల మంచీచెడును గమనిస్తూ.. వాళ్ల బాధలను వింటూ.. వాళ్లకు తోడుగా ఉండటం కోసం ఏదైనా చేయాలని సంకల్పించడం నిజంగా గొప్ప మనసు ఉంటేనే చేయగలం. అది వైఎస్ జగన్‌కు సాధ్యమయింది. అదే ఇప్పుడు వైఎస్ జగన్‌కు ఉన్న ప్లస్ పాయింట్. పాదయాత్రే వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సీఎంను చేస్తుందని ఎప్పుడో తేటతెల్లమైంది. అందుకే.. టీడీపీ నాయకులు, చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు.

టీడీపీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని తట్టుకోలేక పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలే బయటికి వస్తున్నారంటే టీడీపీలో ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈసారి చంద్రబాబు తనకు తానే గోతులు తీసుకుని అందులో పడిపోతున్నాడు. ఆయన్ను ఓడించడానికి వేరే ఎవరో రావాల్సిన అవసరం లేదు. తన కంటిని తన వేలుతోనే పొడుచుకుంటున్నారు చంద్రబాబు. ఆయన మాట్లాడే విధానం కానీ.. జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించే తీరు కానీ.. ప్రధాని మోదీపై విరుచుకుపడే తీరుగానీ.. చివరకు పుల్వామా దాడిపై కూడా రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబు అసలు స్వరూపాన్ని ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్లు మాటలతో కాదు.. తమ ఓటు హక్కుతో చంద్రబాబు అండ్ కోకు సరైన సమాధానం చెబుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version