పార్టీలో ఎన్నో అంతర్గత మార్పులకు శ్రీకారం దిద్దాలన్నది జగన్ భావన. ఎన్నికలకు వెళ్లి అనుకున్న సమయం కన్నా ముందే ఎన్నికలకు వెళ్లి మంచి ఫలితాలు అందుకోవాలన్నది కూడా ఆయన భావన. అందుకే రానున్న కాలంలో ఏడాది లేదా రెండేళ్లలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అన్నది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి అంటున్నారు. వినయంతోనే చెబుతున్నాను పొగరుతో కాదు అని కూడా అంటున్నారాయన. ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో కీలకంగా చర్చకు తావిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీని ఎదుర్కోవడంలో సఫలం అవుతామా లేదా అన్న మీమాంస చాలా చోట్ల చాలా మంది నాయకుల్లో ఉంది.
ఎందుకంటే చాలా చోట్ల చాలా మంది నాయకులపై అసంతృప్తి ఉంది కనుక ! పార్టీలో కూడా అవే స్థాయిలో అంతః కలహాలు ఉన్నాయి. వాటిని దాటుకుని పనిచేయడం చాలా కష్టం. ముఖ్యంగా సంక్షేమానికే నిధులు అన్న సూత్రం ఫాలో అవుతుండడంతో ట్యాక్స్ పేయర్స్ అంతా జగన్ పై కోపంగానే ఉన్నారు. ధరల నియంత్రణ లేదని, పన్నుల బాదుడు ఉందని చాలా మంది విపక్ష నాయకులు ఇప్పటికే బాదుడే బాదుడు పేరిట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండే వైజాగ్ లో పరిణామాలు ఎలా ఉండనున్నాయి. ఇవాళ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పోర్టు స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైసీపీ విభాగ అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాస్ నేతృత్వం వహిస్తున్నారు. భారీ జన సమీకరణ కూడా చేశారు.
ఇక వైవీ రాకతో ఏం జరుగుతుందో చూద్దాం. ముఖ్యంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అనేక వివాదాల్లో ఇరుక్కుని ఉన్నారు. వివాదాలకు కేంద్ర బిందువు ఆయనే ! వ్యాపారాలు బాగా చేసే అలవాటు ఉన్న ఆయన, తన రాజకీయ పదవిని వాటికి వాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలలో ఉన్న ఆయన ఎప్పటి నుంచో వాటిపైనే దృష్టి సారిస్తున్నారు కానీ ప్రజోపయోగ పనులు చేసేందుకు కృషి చేయడం లేదని తెలుస్తోంది. ఇదే కాకుండా సాయిరెడ్డి అనుచరుడిగా పేరుంది. దీంతో ఎంవీవీ సత్య నారాయణ పార్టీకి, ప్రజలకు కూడా చేసిందేం లేదని, సాయిరెడ్డి సాయంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారన్న వాదన కూడా ఉంది. ఇవే కాదు కానీ విశాఖ రాజకీయాల్లో వైవీ రాణించడం సులువు కాదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వివాదం ఓ వైపు నడుస్తోంది. మరోవైపు గంగవరం పోర్టు పనులు జరుగుతున్నాయి. అవి కూడా వేగంగా లేవు అనుకోండి. ఇవే కాకుండా ఇదివరకటి ప్రతిపాదనల మేరకు ఇక్కడ సచివాలయ ఏర్పాటుకు భవనాల సేకరణ చేయాల్సి ఉంది. అన్నీ బాగుంటే ఇక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ సాగించాలని సీఎం కోరిక. ఇవే కాకుండా ఫార్మా కంపెనీలకు సంబంధించి కాలుష్య సమస్యలు అనేకం ఉన్నాయి. వీటిపై కూడా దృష్టి సారించి, ప్రజలకు న్యాయం చేయాల్సి ఉంది. నేరుగా కాకపోయినా ఎమ్మెల్యేలతో అయినా మాట్లాడిస్తే పరవాడ ప్రాంతంలో స్థానిక వ్యతిరేకత కొంతైన తగ్గుతుంది. ఇవేవీ సరిదిద్దకుండా వైవీ రాణించడం కష్టం.