తామంతా ఒక్కటే.. ఎలాంటి విభేదాలు లేవ్.. మా టార్గెట్ కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యడమే.. పథకాలను ప్రజలకు చేరువ చెయ్యడమే అన్న నేతలు.. ఇప్పుడు అసంతృప్తి రాగాలు ఆలపిస్తున్నారు.. ఓ వైపు బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే.. కాంగ్రెస్ పెద్దల నిర్ణయాలను విభేదిస్తున్నారు..? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ లో నేతల లొల్లికి కారణమేంటి..?
తెలంగాణ కాంగ్రెస్ లో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. లోలోనా కొందరు సీనియర్లు అసంతృప్తి గళాలను వినిపిస్తున్నారు.. నిన్నమొన్నటి దాకా తామంతా ఒక్కటే అన్న మాట నుంచి.. కొన్ని నిర్ణయాలు సరిగా లేవన్న కామెంట్స్ బయటికి వస్తున్నాయి.. గతంలో కాంగ్రెస్ అంటే వర్గ విబేధాలకు పుట్టినిళ్లు అనే ప్రచారం ఉంది.. పార్టీలో నిత్యం ఏదో ఒక రచ్చ ఉండేది.. అది కాస్త ఢిల్లీకి చేరడం.. హైకమాండ్ సర్దుబాటు చెయ్యడం షరామామూలుగా ఉండేది..
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా సర్దుమణిగిందని భావించారు.. అందరూ ఏకమై.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజేపీ మీద విమర్శల దాడి పెంచేశారు. మంత్రివర్గకూర్పులో, పదవుల పందేరంలో ఎక్కడా అసంతృప్తి కనిపించలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పార్టీనేతలకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. కాంగ్రెస్‌ను చంపేస్తారా అంటూ జాతీయ నాయకులపై విరుచుకుపడ్డారు.
అయితే జగ్గారెడ్డి ఫైర్ అవ్వడానికి కారణం క్యాబినెట్ విస్తరణ, నామినెటెడ్ పదవుల భర్తీ అనే ప్రచారం జరుగుతోంది.. పదవుల పందేరంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఇవ్వకుండా.. తమకు నచ్చిన వారికి ఇస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకోసం పనిచేసివారికి పదవులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.. మొన్నటి దాకా జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉండగా.. ఆయన్ని నేతలు బుజ్జగించారు.. ఇప్పుడు తాజాగా జగ్గారెడ్డి తెరమీదకు రావడంతో.. ఏం చెయ్యాలో అర్దంకాక నేతలు తలలు పట్టుకుంటున్నారట..