క‌విత స‌రికొత్త‌ రికార్డు.. ద‌క్షిణాదిలోనే తొలి మ‌హిళా నేత‌

తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల స‌రికొత్త రికార్డు సృష్టించారు. ట్విట్టర్‌లో పది లక్షల ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి దక్షిణాది మహిళా నేతగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. దీంతో సోష‌ల్‌మీడియా వినియోగంలో ఆమె ఒక ట్రెండ్‌ సెట్టర్ నిలిచారు. 2010 నుంచి ట్విట్టర్‌ ఖాతాను వినియోగిస్తున్న క‌విత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండును బలంగా వినిపించారు. తెలంగాణ బతుకుపండు బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. రక్తదానం, హెల్మెట్‌ ఆవశ్యకతపై ఇదే ట్విట్టర్‌ వేదికగా కవిత నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి దేశవ్యాప్త మద్దతు లభించింది. అంతేగాకుండా.. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో, ఆ తర్వాత కూడా సాయం కోరుతూ దేశవిదేశాల నుంచి ట్వీట్‌ చేస్తున్న వారికి క‌విత అండగా ఉంటున్నారు. దీంతో ఫాలోవ‌ర్లు అమాంతంగా పెరిగిపోయారు.

ట్విట్టర్‌లో దేశవిదేశాల్లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన దక్షిణాది మహిళా నేతలు దివ్య స్పందన, కనిమొళి, తమిళిసై సౌందర రాజన్, శోభా కరంగ్దలే తదితరులను దాటేసి, వన్‌ మిలియన్‌ ఫాలోవర్లతో క‌ల్వ‌కుంట్ల కవిత అగ్రస్థానంలో నిలిచారు. ఈ సంద‌ర్భంగా ఓ వార్త సంస్థ‌తో ఆమె ముచ్చ‌టిస్తూ ఆనందాన్ని వెలిబుచ్చారు. *కరోనా సమయంలో ట్విట్టర్‌ ద్వారా వచ్చిన వినతులకు వివిధ దేశాలలో ఉన్న టీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి కార్యకర్తల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాయం అందించాం. ట్విట్టర్‌తో సాయం అందుతుందని, పనిచేస్తామని తెలియడంతో ఇటీవలి కాలంలో ఫాలోవర్ల సంఖ్య చాలా వేగంగా పెరిగింది. ఫాలోవర్ల సంఖ్య పది లక్షలకు చేరుకోవడంతో నా బాధ్యత మరింత పెరిగినట్లయింది. మహిళలకు, యువతకు కనెక్ట్‌ కావడానికి ప్రయత్నిస్తా* అంటూ క‌విత పేర్కొన్నారు.