అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటినుంచి చంద్రబాబుకు విధేయుడుగా ఉంటున్న కామినేని ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఈ భేటీ వాటికి ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ కామినేని మాత్రం తన వాదన మరోలా చెబుతున్నారు. విద్యాశాఖలో దాదాపు 1000 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు కొన్ని నెలలగా పెండింగ్‌లో ఉండడంతో ఆ విషయాన్ని కామినేని శ్రీనివాసరావు ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారని… విషయం తెలిసిన వెంటనే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని పిలిచి మాట్లాడిన చంద్రబాబు.. పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తమ జీతాలు అందుకున్న ఉపాధ్యాయులు కామినేని శ్రీనివాస్‌తో పాటు సోమవారం సచివాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో పాటు మాజీ మంత్రి కామినేనికి కూడా థ్యాంక్స్ చెప్పారు.