నవంబర్ 30న జరుగుతున్న తెలంగాణ ఎన్నికలలో విజయం సాధించేందుకు మూడు పార్టీలు శాయి శక్తుల కృషి చేస్తున్నాయి. ప్రచారంలో ప్రజల ముందుకు వెళుతూ వారిపై వరాలజల్లు కురిపిస్తున్నారు. హామీలు ఇస్తున్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఎంత ప్రత్యేకమో, హైదరాబాద్ కు ఖైరతాబాద్ కూడా అంత ప్రత్యేకం. ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో విజయం సాధించాలని ఏ పార్టీ కోరుకోదు. ఖైరతాబాద్ లో బీసీలు ముస్లిం ఓటర్లు ఎక్కువ ఈ నియోజకవర్గంలో గెలుపును శాసించేది వీరే.
ఖైరతాబాద్ ఒకప్పటి జనార్దన్ రెడ్డి అడ్డా. కాంగ్రెస్ కు కంచుకోట. కానీ 2018 ఎన్నికల్లో బిఆర్ఎస్ జండా ఎగిరింది. దానం నాగేందర్ విజయం సాధించారు. ఈసారి కూడా బిఆర్ఎస్ దానం నాగేందర్ ని తమ అభ్యర్థిగా ప్రకటించింది.
నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి తో పాటు, ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు మళ్లీ తమను గెలిపిస్తాయని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున పి జె ఆర్ కుమార్తే విజయా రెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలపై ఎన్నికల అస్త్రాన్ని సంధిస్తున్నారు. పిజేఆర్ వారసురాలిగా ప్రజలకు సేవ చేస్తానంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానంటూ ప్రజల ముందుకు వెళుతున్నారు. బిజెపి తరఫున చింతల రామచంద్రారెడ్డి కే మళ్ళీ టికెట్ ఇచ్చారు. గతంలో ఓటమి పొందాడని సానుభూతి ఉంది. అంతేకాకుండా చింతల రామచంద్రారెడ్డి ఒకసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా చేసిన అనుభవం కూడా ఉంది. నియోజకవర్గం లో మంచి పట్టు ఉంది.
ఎప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్లు ఈసారి ఏ పార్టీకి విజయాన్ని చేకూరుస్తారో చూడాల్సిందే…