ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం..రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న స్థానం. అటు తెలంగాణ ఓటర్లతో పాటు ఏపీ నుంచి వచ్చి ఎక్కువ సెటిల్ అయిన వారు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇక్కడ గెలుపు అనేది కాస్త ఏపీ సెటిలర్లు ఎక్కువ ప్రభావితం చేస్తారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా ఎక్కువగా ఉండేది. అయితే ఇంతవరకు బిఆర్‌ఎస్ ఇక్కడ గెలవలేదు.
2014లో ఇక్కడ టిడిపి గెలవగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపి పొత్తులో పోటీ చేయగా..కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇక గత రెండు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి ఎం రామ్మోహన్ గౌడ్ పోటీ చేసి ఓడిపోతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి బిఆర్‌ఎస్ లోకి రావడంతో సీన్ మారింది. ఇక బిఆర్‌ఎస్ లో రచ్చ మొదలైంది. తాజాగా కేసిఆర్ సీట్లు ప్రకటించడంలో రచ్చ ముదిరింది. సీటుని సుధీర్ రెడ్డికే కేటాయించారు. దీంతో రామ్మోహన్ అసంతృప్తితో ఉన్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ సుధీర్‌కు సహకరించే పరిస్తితి లేదని అంటున్నారు.
ఇక కారు పార్టీలో ఎలాంటి రచ్చ ఉందో కాంగ్రెస్ లో అదే రచ్చ ఉంది. ఇక్కడ సీటు కోసం పోటీ పెరిగింది. ఇప్పటికే జిక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు రామ్ రెడ్డి ఎల్బీనగర్ సీటు రేసులో ఉన్నారు. దరఖాస్తులు పెట్టుకున్నారు. పోటాపోటిగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ సైతం ఎల్బీనగర్ నుంచే దరఖాస్తు పెట్టుకోవడంతో ట్విస్ట్ వచ్చింది.
మధుయాష్కి సైతం ఎల్బీనగర్ లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. అయితే స్థానికేతరుడైన మధుయాష్కికి సీటు ఇవ్వకూడదని మిగతా ఇద్దరు నేతలు పోరాటం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి సీటు ఇస్తుంది..ఒకరికి సీటు ఇస్తే మరొకరు సపోర్ట్ చేయరు. మరి ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు నష్టం చేసే ఛాన్స్ ఉంది.