రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి, భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేసినా, రాంగ్ రూట్‌లో వచ్చి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించినా, ఓవర్ టేకింగ్ చేసినా, బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ విభాగాన్ని మంత్రి ఆదేశించారు.
అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు, సిగ్నల్ జంపింగ్ వంటి విషయాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలను కఠినంగా రూపొందిస్తామన్నారు. సోమవారం ఉదయం లక్డీకపూల్ లోని రవాణాశాఖ సాంకేతిక అధికారులతో మంత్రి పొన్నం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.