టీడీపీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్…! చక్రం తిప్పిన చంద్రబాబు

-

ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి లోక్ సభ లో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుందని ఢిల్లీ మీడియా చెప్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా టీడీపీకి దక్కుతుందని ప్రచారం ఊపందుకుంది. అదే జరిగితే ఎవరిని ఆ అదృష్టం వరిస్తుంది అనే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా అమలాపురం ఎంపీ హరీష్ కి ఆ అవకాశం దక్కే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొన్న జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో దీనిపై చర్చించినట్లు సమాచారం.

నేటి నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది.అనంతరం జూన్ 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.అయితే ఈనెల 26న జరిగే లోక్ సభ స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్ధులను నిలిపేందుకు ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమకు స్పీకర్ పోస్టు కేటాయించాలని ఈ రెండు పార్టీలు బీజేపీని కోరుతున్నాయి. కానీ ప్రధాని మోడీ మాత్రం ససేమిరా అంటున్నారు.

లోక్ సభ స్పీకర్ పోస్టును ఎట్టి పరిస్ధితుల్లోనూ వదలొద్దని ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూను విపక్ష ఇండీ కూటమి పార్టీలు కోరుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా బీజేపీకి బదులు ఈ రెండు పార్టీల్లో ఒకరు స్పీకర్ పదవి తీసుకోవాలని సూచిస్తున్నాయి.స్పీకర్ గా బీజేపీ అభ్యర్థిని ఎన్నుకొని డిప్యూటీ స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇవ్వనున్నారు మోడీ. ఈ మేరకు క్లారిటీ కూడా ఇచ్చేశారు.టీడీపీ, జేడీయూల్లో ఒకరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉంది. అయితే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా జేడీయూకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఉండటంతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ను జేడీయూ వద్దంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చాన్నాళ్ల తరువాత ఏపీకి కేంద్రంలో ప్రాముఖ్యత దొరికిందని ఏపీ ప్రజలు హర్షం వ్యక్తపరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version