ఆ ఎంపీ విశాఖ ప్రజల మనసు దోచుకున్నారా? ఎన్నో ఏళ్లుగా విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్న కీలక ఘట్టాన్ని ఆయన సాధించారా? అంటే.. ఔననే అంటున్నారు విశాఖ ప్రజలు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఎన్నికైన వైసీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణకు అక్కడి ప్రజలు హారతులు పడుతున్నారు. దీనికి కారణం ఏంటి? గతంలో కేంద్రంలో చక్రం తిప్పగలిగిన బీజేపీ నాయకుడే ఎంపీగా ఉన్నా సాధించలేనిది ఇప్పుడు ఏం సాకారం అవుతోంది? అనే ప్రశ్నలకు ఈ స్టోరీనే సమాధానం. విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది.
విశాఖ నుంచి ఈనెల 25(ఈ రోజే) నాడు తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూరత్ తదితర ప్రాంతాలకు నడపడానికి స్పైస్ జెట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవై పు ఆ సంస్థ కార్గో విమానాలు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 15 నుంచి కార్గో విమానాలు విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడవవలసి ఉంది.
కాని రక్షణ శాఖ మోకాలడ్డడంతో కార్గో విమాన సర్వీసుల ప్రతిపాదనకు ఆటంకం ఎదురైంది. విశాఖ నుంచి కార్గో విమాన సర్వీసులు ప్రారంభం కావాలని కొంతమంది వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారు.
దీనిపై ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం వివిధ విమాన సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పించింది. అందులో భాగంగా ఈనెల 15 నుంచి స్పైస్ జెట్ ఆధ్వర్యంలో కార్గో విమానాల సర్వీసుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే విశాఖలోని రక్షణ శాఖ అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో కార్గో విమాన సర్వీసుకు బ్రేక్ పడింది.
దాంతో కార్గో సర్వీసుల నిర్వహణపై స్పైస్ జెట్ సంస్థ రక్షణశాఖ అధికారులకు లేఖ లేఖ రాసింది. స్పైస్ జెట్ కోరిన సమయాలను కేటాయించలేమని రక్షణ శాఖ అధికారులు స్పైస్ జెట్‌కు లేఖ రాసినట్టు విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను సంఘ ప్రతినిధులు కొందరు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు కార్గో విమానాలు నడపాలని విశాఖ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎంవివి సత్యనారాయణ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి గతంలో లేఖ రాశారు.
అనంతరం కేంద్రమంత్రులను ఆయన కలిసి విమానాల కోసం చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా కార్యనిర్వహక రాజధాని ఏర్పాట్లు చేయడానికి పలు చర్యలు చేపట్టిందని, అలాగే దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఎయిర్ ట్రాఫిక్ 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో తప్ప ఇతర సమయాల్లో విమానాలు రాకపోకలకు రక్షణ శాఖ అభ్యంతరం చెబుతుందని, దీనివల్ల అనేక విమాన సంస్ధలు సర్వీసులు నడపడానికి ఆసక్తి చూపడం లేదని ఎంపి లేఖలో పేర్కొన్నారు.
సమాంతర టాక్సీ ట్రాక్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని,అలాగే కొత్తగా నిర్మించిన ఎన్5 టాక్సీ ట్రాక్‌ను అందుబాటులోకి తేవాలనికోరారు. దీంతో ఇప్పుడు ఎంపీ కృషి ఫలించింది. నేటి నుంచి కార్గో విమానాలు ఇక్కడ నుంచి తిరగనున్నాయి. దీంతో ఎంపీకి ఇక్కడి వ్యాపారులు, ప్రజలు కూడా ధన్యవాదాలు చెబుతూ.. సోషల్ మీడియాలో చెలరేగుతున్నారు.