మహానాడు పండుగ రెండు రోజుల పాటు జరిగింది. ఈ నెల 27, 28 తేదీలలో జరిగిన ఈ పండుగ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.ముఖ్యంగా బీసీ నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపింది. వివిధ పార్టీలలో ఉన్న నాయకులు కూడా ఎన్టీఆర్ కు శత జయంతి ఉత్సవాల వేళ నివాళులిచ్చారు. వాస్తవానికి ఆ రోజు ఎన్టీఆర్ ఎందరో బీసీ నాయకులకు అవకాశాలు ఇచ్చారు. ఆ విధంగా ఆయన ఆరాధ్యుడు అయ్యారు. నిమ్న కులాలకూ, వర్గాలకూ ఆయన ఆరాధ్యుడే ! నిన్నటి వేళ ఒక్కసారి బాలయోగి లాంటి లీడర్లను అంతా తలుచుకున్నారు. ఆయన్ను ఆ రోజు లోక్ సభ స్పీకర్ ను చేసింది చంద్రబాబే ! అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతికి స్పీకర్ అవకాశం ఇచ్చింది చంద్రబాబే ! ముమ్మాటికీ నిజం దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి లీడర్లు అంతా అక్కడ నుంచి ఎదిగిన వారే ! అందుకే నిన్నటి వేళ వేదికపై ఉన్న బీసీ నాయకులంతా పండుగ చేసుకున్నారు.
వైసీపీ ఇప్పటికిప్పుడు ఇచ్చిన అవకాశాలు మహా అయితే 17 మంది మంత్రులు కావొచ్చు. కానీ తాము పార్టీ ఆవిర్భావం నుంచి ఎందరినో పెద్దవాళ్లం చేశాం అని టీడీపీ ఎంతో హుందాగా చెబుతోంది. వెలమ, కాపు ,యాదవ,చాకలి ఇలా ఒక్కటేంటి ఎన్నో కులాలకు అవకాశాలు ఇవ్వడమే కాదు వారి రాజకీయ ఎదుగుదలకు కారణం అయ్యారు ఎన్టీఆర్ మరియు చంద్రబాబు.
నిన్నటి వేళ ఉత్తరాంధ్ర లీడర్లలో అశోక్ గజపతి రాజు (బీసీ నాయకుల ఆదరణలో ఉండే లీడర్) లాంటి చదువరులు కనిపించారు. అదేవిధంగా నేరుగా కాకున్నా కొంత ఉత్తరాంధ్రతో అనుబంధం ఉన్న తుని లీడర్ యనమల కనిపించారు. కొంచెం కటువుగా మాట్లాడినా అయ్యన్న కనిపించారు. యువ నేత నాన్న వారసత్వంతో పాటు తనకంటూ ఓ క్రేజ్ ను పెంచుకున్న ఎంపీ రామూ కనిపించారు. ఏ విధంగా చూసుకున్నా తెలుగు దేశం ఆ రోజు ఎర్రన్నను ఎంతగానో ప్రోత్సహించింది. ఆ విధంగా ఆ కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడూ ఆదరించింది. కనుక తెలంగాణ లోనూ, ఆంధ్రాలోనూ చిన్న చిన్న సామాజిక వర్గాలన్నింటికీ నిన్నటి వేళ పెద్దాయన పుట్టిన్రోజు ఓ పండుగే ! కానీ దురదృష్టం ఇక్కడి నుంచి ఎదిగివచ్చిన కొందరు లీడర్లు మరీ! శ్రుతి మించి మాట్లాడడమే ! రాజకీయమే కావొచ్చు కానీ కాస్త హద్దు దాటకుండా స్పీకర్ తమ్మినేని కానీ మంత్రి రోజా కానీ మాట్లాడితే బాగుండేది అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ ఇద్దరూ ఆ రోజు టీడీపీ నుంచి ఎదిగిన నాయకులే కదా! అందుకే కాస్త సంయమనం పాటించి మాట్లాడితే బాగుండేది అన్న వాదన కూడా వినిపిస్తోంది.