ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ (శ్రీకాకుళం) : ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ కూర్మంలో నిత్యాన్నదానానికి సహకరించేందుకు ముందుకువచ్చిన దాతలను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభినందించారు.ఈ మేరకు వీరంతా క్యాంప్ ఆఫీసులో ఆయనను కలుసుకుని, తమ వంతు విరాళం అందించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక ధామం శ్రీ కూర్మ క్షేత్రంలో కొత్త పాలక మండలి ఏర్పాటయ్యాక నిత్యాన్నదాన కార్యక్రమానికి సంకల్పించామని, తన సంకల్పంకు అనుగుణంగా దాతలు ముందుకు వచ్చి ఈ క్రతువుకు ఆర్థిక సాయం అందించడం అభినందనీయం అని అన్నారు.
ఇతర పుణ్య క్షేత్రాలలో ఏ విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారో పరిశీలించి రావాలని పాలక మండలికి సూచించారు. సంబంధిత పద్ధతుల్లో మేలైనవి, ఇక్కడ అమలు చేసి నిత్యాన్నదాన పథకాన్ని నిర్విఘ్న రీతిన కొనసాగించాలని కోరారు.
అదేవిధంగా ఆలయ అభివృద్ధిలోనూ పలువురు దాతలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ప్రపంచ స్థాయిలో ఆలయ ఖ్యాతిని మరింత విస్తరింపజేయాలని కూడా సూచించారు. ధర్మానను కలిసి విరాళాలు అందించిన వారిలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నిర్వాహకులు (రూ.1,19,000),బరాటం రమణ మూర్తి (రూ.1,00,000)అదేవిధంగా వైజాగ్ వాస్తవ్యురాలు ఎం. సుభద్ర రాణి (రూ.10,000) ఉన్నారు. వీరిని ఎమ్మెల్యే ధర్మాన అభినందించారు.