ఏపీలో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపించడం లేదు అనే విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎంపీలు కూడా మళ్లీ నిలబడటానికి జంకుతున్నారు. దానికి కారణం.. ఈసారి ఖచ్చితంగా తాము ఓడిపోతామనే భయం. నిలబడి ఓడిపోయే బదులు… పోటీ చేయకుండా ఉండటం ఉత్తమం అని చాలామంది సిట్టింగ్ ఎంపీలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మురళీ మోహన్ కూడా ఈసారి తనకు పోటీ చేసే ఆసక్తి లేదని చంద్రబాబుకు చెప్పేశారు.
దీంతో ఏపీలో ఉన్న 25 లోక్ సభ స్థానాలకు ఎవరిని పోటీలోకి దించాలా? అని చంద్రబాబు తర్జనభర్జన పడ్డారు. చివరకు 25 మంది అభ్యర్థులను అతి కష్టం మీద ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి మురళీ మోహన్ కోడలు రూపను నిలబెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో మురళీ మోహన్ నిలబడకున్నా.. ఆయన ఫ్యామిలీ నుంచే మరో వ్యక్తి నిలబడటం టీడీపీలో పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఏపీ ప్రజలకు అర్థమవుతోంది.
ఒంగోలు నుంచి మంత్రి శిద్ధా రాఘవరావు, తిరుపతి నుంచి పనబాక లక్ష్మీ, నెల్లూరు నుంచి బీద మస్తాన్ రావు, విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు, ఏలూరు నుంచి మాగంటి బాబు, చిత్తూరు నుంచి శివప్రసాద్ ల పేర్లు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. మిగితా స్థానాలు కూడా ఖరారయినట్లు సమాచారం.