మరోసారి భగ్గుమన్న నందికొట్కూరు రాజకీయాలు.. ఇరు వర్గాల దాడులు..

కర్నూలు రాజకీయాల్లో బైరెడ్డి, గౌరు ఫ్యామిలీలదే హవా. ఈ రెండు కుటుంబాలు తాతల కాలం నుంచి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నాయి. కాగా కాలక్రమేణా.. బైరెడ్డి ఫ్యామిలీలో విభేదాలు రావడంతో రాజశేఖర్ రెడ్డి, అతడి తమ్ముడి కొడుకు సిద్ధార్థరెడ్డి చెరో పార్టీలో కొనసాగుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున సిద్ధార్థరెడ్డి, బీజేపీ తరఫున రాజశేఖర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. తమ సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకుని ప్రచారం నిర్వహించారు.
అయితే అటు గౌరు ఫ్యామిలీ కూడా కర్నూలు రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంది. పాణ్యం నుంచి గౌరు చరితా రెడ్డి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇటు నంది కొట్కూరులోనూ తమ అనుచరిడిని నిలబెట్టినా..

వైసీపీ తరఫున సిద్ధార్థరెడ్డి తన అభ్యర్థి ఆర్థర్ ను గెలిపించుకున్నారు. ఈ ఓటమితో యువ నాయకుడు సిద్ధార్థరెడ్డి, గౌరు వెంకట్ రెడ్డికి ఉన్న విభేదాలు తారా స్థాయికి పెరిగాయి. ఇక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గౌరు వెంకట్ రెడ్డిలు అనూహ్యంగా ఎన్నికల సందర్భంగా కలిసి పోవడం ఒక సంచలనమే అని చెప్పాలి. ఇదిలా ఉంటే.. నంది కొట్కూరులో సిద్ధార్థ అనుచరులకు, గౌరు వెంకట్ రెడ్డి అనుచరులకు నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆధిపత్య పోరులో ఇరువురి మనుషులు కూడ చనిపోయారు. మొన్నటి వరకు జరిగిన మున్సిపల్, పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే చాలా గొడవలు జరిగాయి వీరిద్దరి మధ్య.

ఇప్పుడు మరోసారి వీరి అనుచరుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. నందికొట్కూరు మండలం కోళ్లబాపురంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఇందులో టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు పోలీసులకు కూడా దెబ్బలు తాకాయి. ఓ కానిస్టేబుల్ అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లారు. దీంతో మరోసారి నందికొట్కూరు రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇక దీనిపై సిద్ధార్థ రెడ్డి, గౌరు వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాలి.