ఎన్టీఆర్ అందరి వాడు అని కొడాలి నాని అనే మాజీ మంత్రి అంటున్నారు. ఎన్టీఆర్ కు సిసలు రాజకీయ వారసుడు జగన్ అని కూడా అంటున్నారు. తాము ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని కూడా చెబుతున్నారు. కనుక ఆయన విగ్రహానికి ఏ రంగు వేసిన తప్పేం లేదని కూడా అంటున్నారు. ఈ స్థాయిలో కొడాలి నానిని ఆయన్ను సొంతం చేసుకుని మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ నుంచి కౌంటర్లే కరువవుతున్నాయి. వాస్తవానికి టీడీపీ హయాంలో కూడా ఎన్టీఆర్ కు రావాల్సిన గుర్తింపు రానే లేదని కొడాలి నాని లాంటి ఫక్తు ఎన్టీఆర్ అభిమానులు తరుచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఆత్మ గౌరవం అనే నినాదాన్ని టీడీపీ బలీయంగా వినిపించక చాలా కాలం అయిందని కూడా అంటుంటారాయన. అందుకే తాము ఎన్టీఆర్ కు ఇవ్వాల్సినంత గౌరవం, ఎన్టీఆర్ పుట్టిన ఊరు (నిమ్మకూరు) కు చేయాల్సినంత సాయం చేస్తూనే ఉంటామని అంటున్నారు. ఆ విధంగా పబ్లిక్ లో పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేయగలుగుతున్నారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేళ వైసీపీ తరఫున ఓ కార్యక్రమం కూడా ఉంటే ఉంటుంది. కాదనలేం కూడా !
ఓ విధంగా ఎన్టీఆర్ జీవన సహచరి లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చి ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపగలిగారు. అదేవిధంగా ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టి (విజయవాడ కేంద్రంగా ఏర్పాటయిన జిల్లాకు) కొంత మైలేజీ అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే బాలయ్యకు కూడా ఫేవర్ గా ఉంటూ జగన్ కొంత మేలు చేస్తూ ఉన్నారనే చెప్పాలి. ఇప్పుడంటే పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారేమో కానీ ఆమె రేపటి వేళ వైసీపీ గూటికి చేరినా చేరవచ్చు. అప్పుడు ఆమెను ఓ అక్క మాదిరి ఆడపడుచు మాదిరి తాము తప్పక ఆదరిస్తామని ఎప్పటి నుంచో వైసీపీ అంటోంది. ఓ విధంగా ఎన్టీఆర్ ను అన్ని విధాలా తమకు అనుగుణంగా మలుచుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపి మంచి ఫలితాలే అందుకుంది వైసీపీ. ఆ స్థాయిలో టీడీపీ ఇవాళ పని చేయడం లేదు అన్నది ఓ వాస్తవం.