ఆ మాజీ ఎమ్మెల్యేని పాత సెంటిమెంట్ వెంటాడుతుందా…?

-

ఆ మాజీ ఎమ్మెల్యేను ఓ కుర్చీ తెగ టెన్షన్ పెట్టేస్తోంది. ఆఫీసులో అడుగు పెట్టాలంటేనే సెంటిమెంట్ వెనక్కు లాగేస్తోంది.దీంతో గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పార్టీ కేడర్ కి కొత్త కండీషన్ పెట్టారట.ఎవరైనా తనను కలవాలంటే గాజువాకలోని క్యాంప్ కార్యాలయానికి రావాలని సూచిస్తున్నారట. సిటీ మధ్యలో కార్పొరేట్ లుక్‌తో ఆఫీస్ ఉండగా.. శ్రీనివాస్ గాజువాక ఎందుకు పిలుస్తున్నారనే ఆరాలు మొదలయ్యాయి. అధ్యక్షుడి ఆలోచన వెనుక అంతర్యం తెలుసుకున్న కేడర్ ఇప్పుడు ఔనా….!. అని చర్చించుకుంటున్నారట.


పల్లా శ్రీనివాస్ గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే. పార్టీకి విధేయుడైన బీసీ నేత కావడంతో విశాఖ పార్లమెంట్ అధ్యక్ష పదవి కట్టబెట్టింది అధిష్ఠానం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇష్టపడి బాధ్యతలు తీసుకున్నారు. అసలే సివిల్ ఇంజనీర్‌ పైగా వాస్తు భయం. ఇంకేముంది ఆఫీసులో మార్పులు చేయాల్సిందేననే పట్టుదలతో ఉన్నారట ఆ మాజీ ఎమ్మెల్యే.

ఇంతకీ అధ్యక్ష హోదాలో పల్లా శ్రీనివాస్‌ పార్టీ ఆఫీసులో అడుగుపెట్టకపోవడానికి కారణం వాస్తు
దోషమేనట. ఇక్కడ చేపట్టిన నిర్మాణాలవల్లే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని ఆయన బలంగా నమ్ముతున్నారట. అలాగే ప్రెసిడెంట్ కుర్చీకి సెంట్‌మెంట్ ఉంది. రెండు దఫాలుగా అధ్యక్షులుగా పనిచేసిన వారు రాజీనామాలు చేయకుండానే పార్టీ ఫిరాయించడం.. పల్లా టెన్షన్‌కు కారణంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ.రెహ్మాన్ అధ్యక్షుడి హోదాలో వైసీపీలో చేరిపోయారు. నగరపార్టీ పదవి కోసం హైడ్రామాలు నడిపిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైతం ఎక్కువ కాలం ఆ సీట్లో కూర్చోలేదు. ఆయన కూడా అధ్యక్షుడు పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీకి మద్దతు ప్రకటించారు.

ఇక సిటీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్‌కుమార్‌ రెబల్ అవతారం ఎత్తారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ పార్టీతో చాలా కాలంగా దూరం పాటిస్తున్నారు. మరో ఎమ్మెల్యే గణబాబు నియోజకవర్గ వ్యవహారాలకు పరిమితమయ్యారు. పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నది ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రమే. ఇవన్నీ వాస్తు ప్రభావంతో జరుగుతున్న పరిణామాలేనని నమ్ముతున్న పల్లా.. పార్టీ కార్యాలయంలో మార్పులు అనివార్యమని భావిస్తున్నారట. ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం కూడా కళ్లకు కట్టినట్టు లేదని.. వీధిపోటు వల్ల నిర్ణయాలేవీ అమల్లోకి రావడం లేదని అనుకుంటున్నారట. ఈ కారణాలతోనే పార్టీ ఆఫీసులో మార్పులు అనివార్యమనే నిర్ణయానికి వచ్చారట పల్లా. అవి జరిగేంత వరకు.. టీడీపీ కేరాఫ్ గాజువాకే. మరి కొత్త అధ్యక్షుడు సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇదే సమయంలో పల్లా పెట్టిన కండిషన్ కూడా కేడర్‌ను ఆలోచనలో పడేసిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version