నాకు అనుభవం, అవగాహన లేదు, ఏం చెయ్యాలో నాకు తెలియదు అని చెప్పే మీరు ఏ అర్హతతో ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. దశ దిశ, స్థిరత్వం లేకుండా ఎప్పుడు, ఎక్కడ ఏ విధంగా మాట్లాడతారో తెలియని మీరు పౌరుషం గురించి మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ నాయకులను పంచలు ఊడేలా కొట్టాలని పిలుపునిచ్చి.. అదే పార్టీలో ప్రజారాజ్యంను విలీనం చేసినపుడు మీ పౌరుషం ఏమైంది? గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను తాట తీస్తానని హెచ్చరించి.. మీ రాజకీయ లబ్ధి కోసం అదే కేసీఆర్‌తో మిలాఖాత్ అయ్యి రెండు నాలుకల ధోరణిని అవలంభించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై మీరు విమర్శలు చేయటం సిగ్గుమాలిన చర్య. ప్రజా సేవలో ఉన్న మీరు ప్రజాభివృద్ధికి అండగా నిలవాల్సింది పోయి ప్రజా కంఠకుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దళితోభ్యున్నతి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నాలుగున్నరేళ్లలో రూ.48 వేల కోట్లు ఖర్చు చేసి ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిస్తే.. వారి అభివృద్ధిని అడ్డుకునేలా మీరు ప్రవర్తిస్తున్నారు.
1. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని దళితులపై ప్రతి పదిహేను నిమిషాలకు ఒక అత్యాచారం, హత్య జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో 52వేల అత్యాచారాలు జరిగాయి. 11 మందిని పోలీసులు కాల్చి చంపితే పవన్ కల్యాణ్ ఏనాడూ వారిని ఎందుకు ప్రశ్నించలేదు?
2. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని కేంద్రం నీరుగార్చాలని చూసినపుడు టీడీపీ ఎదురు నిలిచినపుడు మీరు ఎక్కడికి వెళ్లారు?
3. గత ప్రభుత్వాల హయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం కేటాయించిన రూ.22వేల కోట్లను దారి మళ్లించారు. దళిత వాడల్లో ఖర్చు పెట్టాల్సిన నిధులతో ఇడుపులపాయకు రోడ్లు వేసుకున్నారు. బయ్యారం ప్రాజెక్టు కోసం గిరిజనులకే సొంతమైన 1.60 లక్షల ఎకరాల భూములను అల్లుడికి కట్టబెట్టారు. ఇవన్నీ మీకు తెలిసినా మీరు ఎందుకు ప్రతిపక్ష నాయకుడికి అండగా నిలుస్తున్నారు?
4. దళితులను ద్వేషించే జగన్మోహన్ రెడ్డితో మీకు స్నేహం ఏ విధంగా కుదిరింది? అసలు దళితులంటేనే గిట్టని జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా మీకు మిత్రుడు ఎలా అయ్యారు?
5. ఎస్సీ విద్యార్ధులకు విదేశీ విద్య, ఉన్నత విద్య వంటి వినూత్న పథకాలను అందిస్తున్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు చెప్పులు కుట్టేవారు, డప్పు కళాకారులకు రుణాలు రెండు లక్షలకు పెంచటం దళిత ద్రోహమా.?
6. రాష్ట్రానికి రావాల్సిన రూ.350 కోట్లను ఇవ్వకుండా కేంద్రం మోసం చేసినా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు.? వెనకబడిన ప్రాంతాల్లో అధికంగా ఉంది దళితులు కాదా?
7. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని మోసం చేసిన బీజేపీని పల్లెత్తుమాట అనకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న వారిపై విమర్శలు చేయడం పవన్‌కళ్యాణ్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? పైగా ఉత్తరాంధ్రలో ప్రాంతీయ చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా?
8. ఉత్తరాంధ్రలో మీ సభ ఏర్పాట్ల సమయంలో ఇద్దరు కార్యకర్తలు చనిపోతే ప్రభుత్వం చంద్రన్న బీమా ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకుంది. అయినా మీరు అదే పథకాన్ని విమర్శించి రాజకీయ లబ్దిపొందాలని ఎందుకు ప్రయత్నించారు?
9. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారాలోకేష్ సామర్ధ్యం గుర్తించి ప్రపంచ స్థాయి సంస్థలు వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నాయి. వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అవేవీ మీకు కనిపించటం లేదా? పైగా ఆయనపై చేసిన ఆరోపణలు నిరూపించమంటే ఎందుకు పారిపోయారు?
10. ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ అనేది ఒక సంస్థ అని తెలియని మీరు మంత్రి నారా లోకేష్ పాలనను విమర్శిస్తారా?
11. రాష్ట్రంలోని అన్ని సీట్లకు తాను పోటీచేయలేనని, అంత బలం తనకు లేదని గతంలో చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అన్ని స్థానాల్లో పోటీచేస్తామనడం, కేంద్రంలోని బీజేపీకి, ప్రతిపక్ష వైసీపీకి మద్దతుగా మాట్లాడటంలో ఆంతర్యమేంటి.?
12. అధికారం మీద యావ లేదంటూనే.. తనని ముఖ్యమంత్రి చేయండి అంటూ బహిరంగ సభల్లో ప్రజలను వేడుకోవటాన్ని ఏమనుకోవాలి.?
13. 5 కోట్ల ఆంధ్రులను రోడ్డున పడేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్, జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ చెట్టాపట్టాలు వేసుకొని తిరగటం వెనుక కుట్రేమిటి.?
14. తెలంగాణ కోసం నా రక్తం ధారపోస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌కు ప్రజల సమస్యలు పట్టలేదు. కేవలం కేసీఆర్ దయ, ప్రాప్తం కోసం తెలంగాణలో యాత్ర చేసింది వాస్తవం కాదా?
15. ప్రశ్నించటానికే వచ్చానన్న పవన్ కల్యాణ్ జనసేన అధ్యక్షుడిగా ఏనాడైనా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? కేసీఆర్‌ను బాబాయ్‌గా, కవితను చెల్లెమ్మగా అసలు కేసీఆర్ కుటుంబమే దేవుడు ఇచ్చిన గొప్ప వరంలా పవన్ అభివర్ణించటం దేనికి సంకేతం.?