తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. అధికార అన్నాడీఎంకేలో కుర్చీ కొట్లాట పతాక స్థాయికి చేరింది. ఆ పార్టీ సర్వ సభ్య సమావేశంలో సాగిన వ్యవహారాల్ని సీరియస్‌గా పరిగణించిన పన్నీరు సెల్వం సచివాలయానికి దూ రంగా గ్రీన్‌వేస్ రోడ్డుకే పరిమితమయ్యారు. సీఎం పళనిస్వామి కరోనా సమీక్షను సైతం బహిష్కరించి, మద్దతుదారులతో మంతనాల్లో మునగడం చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం సోమవారం వాడివేడిగా సాగిన విషయం తెలిసిందే.
ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి ఈ సమావేశం వేదికగా వాదులాటకు దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం ఎవరో, 11 మందితో మార్గదర్శక కమిటీ వ్యవహారంలో ఈ ఇద్దరు నువ్వా, నేనా అన్నటు వాదులాడుకోవడమే కాదు, ఎవరు ఏ ద్రోహం చేశారో, తలబెట్టారో అంటూ తీవ్రంగానే విడుచుకు పడ్డారు. దీంతో అక్టోబర్ 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఎవరో అన్న ప్రకటన అంటూ సభను ముగించేశారు. అలాగే, కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు.