జనసేనాని పవన్ కళ్యాణ్ అంటేనే.. సోషల్ మీడియాకు పెద్ద ఆసక్తి. ఆయన ఎక్కడ ప్రసంగించినా.. ఎక్కడ సభ పెట్టినా.. వెంటనే సోషల్ మీడియాలో వేల సంఖ్యలో కామెంట్లు పడిపోతుంటాయి. కొందరు లైకులు. మరికొందరు కామెంట్లు చేస్తుంటారు. దీనిని ఆధారంగా చేసుకుని జనసేన మీడియా వింగ్ పవన్ రేటింగ్‌ను అంచనా వేస్తుంటుంది. రెండు వారాల కిందట విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు పవన్.
అదే సమయంలో విజయవాడలోను, విశాఖ, విజయనగరంలోనూ పార్టీ క్రియాశీలక నేతలతో ఆయన భేటీ అయి.. తనదైన శైలిలో ప్రసంగాలను గుప్పించారు. ఆయా ప్రసంగాలను ఆసక్తిగా విన్న నెటిజన్లు.. తమదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా విశాఖ లాంగ్ మార్చ్ కన్నా కూడా తెలుగు మాధ్యమాన్ని తొలగిస్తామంటూ.. జగన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన, దీనిపై పవన్ తనదైన శైలిలో స్పందించిన తీరుపై నెటిజన్లు ఆసక్తిగా స్పందించారు. కొందరు హద్దు మీరికూడా విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ చేసిన వాదనను నెటిజన్లు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కూడా సమర్ధించారు. ఉన్నవారి బిడ్డలకేనా ఇంగ్లీష్ చదువులు… పేదలు, దళితుల బిడ్డలకు ఇంగ్లీష్ అక్కర్లేదా? అన్న జగన్ వ్యాఖ్యలను భారీ ఎత్తున నెటిజన్లు సమర్ధించారు. ఈ సమయంలోనే తెలుగును ఖూనీ చేస్తున్నారు. మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా.. తెలుగు రద్దుపై గుండెలు బాదుకోలేదా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, మీ బిడ్డలను తెలుగులోనే చదివిస్తున్నారా? అంటూ కామెంట్లు కుమ్మరించారు.
చెప్పడానికేనా నీతులు.. అంటూ మరికొందరు దెప్పిపొడిచారు. ఇక, సంస్తాగత అభిమాన గణం మాత్రం పవన్‌ను భుజాలకు ఎత్తుకున్నా.. లోలోన వారు కూడా ఇంగ్లీష్ మీడియానికే జైకొట్టారు. దీంతో మొత్తంగా ఇసుక విషయంలో పవన్ సాధించిన గ్రాఫ్ కంటే.. ఇప్పుడు తెలుగును భుజాల కెత్తుకుని చేసిన వ్యాఖ్యలతో ఆయన గ్రాఫ్ పడిపోయిందని జనసేన వర్గాలే చెబుతుండడం గమనార్హం. ఇదీ సంగతి!!