పవన్ కల్యాణ్…తెలుగు సినిమా రంగంలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఇలా సినిమాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ అవ్వలేకపోతున్నారని తెలుస్తోంది. ప్రశ్నించడం కోసమని పార్టీ పెట్టి 2014లో టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా, టీడీపీ-బీజేపీ గెలుపు కోసం కృషి చేశారు.
సరే మొదటిసారే కదా ఓడిపోయింది..ఈ సారి పవన్ కష్టపడి పార్టీని బలోపేతం చేసి, నెక్స్ట్ ఎన్నికల్లో గెలిపిస్తారని అభిమానులు, కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సభల్లో సీఎం పవన్ అంటూ గోల చేసే అభిమానులు, ఈ సారి పవన్ నిజంగానే సీఎం అయిపోతారని అనుకుంటున్నారు. కానీ ఏపీలో జనసేనకు అందుకు తగ్గట్టుగా పరిస్తితులు ఉన్నాయా? అంటే అసలు లేవనే చెప్పొచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్న జనసేన ఏ మాత్రం బలపడలేదు. ఇంకాస్త వీక్ అయింది తప్ప, రాష్ట్ర స్థాయిలో పుంజుకోలేదు.
అసలు 175 నియోజకవర్గాల్లో జనసేనకి సరైన నాయకులు లేరు. ఇటు పవన్ సైతం మళ్ళీ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే పవన్ సీఎం అవ్వడం పక్కనబెడితే, కనీసం ఎమ్మెల్యేగా గెలవగలరా? అనే సందేహం వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికైతే 2019 ఎన్నికల సీన్నే పవన్ మళ్ళీ రిపీట్ చేసేలా ఉన్నారని చెబుతున్నారు.