ఏపీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఓవైపు కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో వైరల్ ఫీవర్లు ప్రబలుతున్నాయి. దీంతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. రోగులకు సరిపడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓపీ సేవల వద్ద రోగులు కిలోమేటర్ల మేర బారులు తీరుతున్నారని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వైరల్ ఫీవర్లతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
కేవలం 10 రోజుల్లోనే 5 లక్షల మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి బాధితుల సంఖ్య 20-30శాతం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఇంట్లో దాదాపు ఒకరు వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతుండటంతో నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు,చలి జ్వరం ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలని సూచన చేస్తున్నారు.