పవన్ కల్యాణ్ వంకర మాటలు మాట్లాడకు.. తెలంగాణ ప్రజలు దేవుళ్లు

-

పవన్ కల్యాణ్ ఎందుకు వంకర మాటలు మాట్లాడుతున్నావు. నేను హైదరాబాద్ వచ్చి 36 ఏళ్లు అయింది. హైదరాబాద్‌లో ఆంధ్రాప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు దేవుళ్లు. 36 ఏళ్లలో ఏ ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా ఇప్పటి వరకు నన్ను పల్లెత్తి మాట అనలేదు. తెలంగాణ బిడ్డలకు ఒక టీ ఇచ్చినా చాలు.. వాళ్లు గుండెల్లో పెట్టుకుంటారు. తెలంగాణ ప్రజలే కాదు.. తెలంగాణ నాయకులు కూడా అంతే ఆత్మీయంగా ఉంటారు.. అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు.

posani krishnamurali fires on pawan kalyan

తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడుతున్నారని.. తెలంగాణ పాకిస్థాన్ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పోసాని మండిపడ్డారు. మీడియా సమావేశం నిర్వహించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పోసాని ఖండించారు. తెలంగాణలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలను పవన్ కల్యాణ్ కావాలనే రెచ్చగొడుతున్నాడ‌ని, రెండు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చుపెడుతున్నాడ‌ని పోసాని వెల్లడించారు.

కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నది నువ్వే కదా..

ఒకప్పుడు కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పింది నువ్వే కదా పవన్ కల్యాణ్ అంటూ పోసాని మండిపడ్డారు. కేటీఆర్‌ను వాటేసుకున్నాడు. కవితను చెల్లెమ్మా అంటూ తియ్యగా మాట్లాడాడు.. ఇప్పుడేమో జగన్‌ను విమర్శించడం కోసం మరోలా మాట్లాడుతున్నాడంటూ పోసాని వ్యాఖ్యానించారు.

సెంటు భూమి ఆంధ్రావాళ్లని బెదిరించి లాక్కున్నారని నిరూపిస్తావా?

పవన్ కల్యాణ్.. నువ్వు టాప్ హీరోవి. నీ మాటలు నేను నమ్ముతాను. నువ్వు చెబుతున్నట్టుగా కేసీఆర్ ఆంధ్రా ప్రజల భూములను ఎక్కడ కబ్జా చేశారో చూపించు. ఎవరిని బెదరించి లాక్కున్నారో నిరూపించు. నీకు పాదాభివందనం చేస్తా.. అంటూ పోసాని పవన్‌ను ప్రశ్నించారు.

ఆంధ్రావాళ్లను ఎక్కడ కొట్టారో చూపించు..

ఆంధ్రావాళ్లను కొడుతున్నారు.. తరుముతున్నారు.. విసుగు పుడుతున్నది.. అని అంటున్నావు కదా.. ఎన్నిసార్లు తెలంగాణ బిడ్డలు ఆంధ్రా ప్రజల ఇళ్లల్లోకి వెళ్లి జుట్టు పట్టి బయటికి లాగి తరిమి తరిమి కొట్టారో నిరూపించు. తెలంగాణలోని ఏ జిల్లాలో కొట్టారో చెప్పు. అలా ఏ ఆంధ్రా కుటుంబమైన దాడికి గురైందా. చూపించండి పవన్ కల్యాణ్.. మీ పాదాలను నేను దండం పెడుతా అంటూ పోసాని నిప్పులు చెరిగారు.

ఆంధ్రా వ్యక్తే ఆంద్రా వ్యక్తిని చంపేశాడు..

నువ్వు చెప్పిన వాటిలో మాత్రం ఒకటే నిజం పవన్. తెలంగాణ నడిబొడ్డున ఒక ఆంధ్రా వ్యక్తి మరో ఆంధ్రా వ్యక్తిని చంపేశాడు. చంపిన వ్యక్తి ఆంధ్రా వ్యక్తే.. చనిపోయిన వ్యక్తి ఆంధ్రా వ్యక్తే. చంపింది చంద్రబాబు… చనిపోయింది ఎన్టీఆర్.. ఆయన చావుకు కారణం చంద్రబాబు కాదా? మరి.. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు చెప్పడు.. అంటూ పోసాని.. పవన్‌పై విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news