చావనైనా చస్తా కానీ.. ఆ పని మాత్రం చేయను: రాహుల్ గాంధీ

-

మోదీ.. నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మా నానమ్మ, తాతను కూడా వదల్లేదు. నా తండ్రినైతే అనరాని మాటలు అన్నారు.. రాహుల్ అన్నారు.

కావాలంటే చచ్చిపోతా.. కానీ.. అటువంటి పని మాత్రం చేయను అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎందుకు, ఎప్పుడు, ఎలా అంటారా?

ఈ మధ్య ప్రధాని మోదీ.. రాహుల్ గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు కదా. చివరకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. అవినీతిలో రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య రాజకీయం కాస్త వ్యక్తిగత దూషణగా మారిపోయింది.

అయితే.. మోదీ వ్యాఖ్యలపై చాలా మంది కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ప్రియాంకా గాంధీ అయితే.. మోదీని దుర్యోధనుడితో పోల్చారు. ఐఎన్ఎస్ విరాట్ ను తమ కుటుంబ విహార యాత్ర కోసం వాడుకున్నారంటూ మోదీ.. మరోసారి రాజీవ్ గాంధీపై విమర్శలు చేశారు.

ఈనేపథ్యంలో మోదీ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. చావనైనా చస్తా కానీ.. మోదీ కుటుంబంపై తాను ఎదురుదాడి చేయనని స్పష్టం చేశారు.

మోదీ.. నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మా నానమ్మ, తాతను కూడా వదల్లేదు. నా తండ్రినైతే అనరాని మాటలు అన్నారు. ఇలాంటి ఎన్ని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా.. నేను మాత్రం మోదీ కుటుంబాన్ని విమర్శించను. వాళ్లను రాజకీయాల్లోకి లాగను. అది కరెక్ట్ కాదు. ఆయన నా కుటుంబాన్ని విమర్శించారని.. నేను ఆయన కుటుంబాన్ని విమర్శించను. అలా చేయాల్సి వస్తే చావడానికైనా ఇష్టపడుతా.. కానీ.. మోదీ తల్లిదండ్రులను నేను అవమానించను. నేను బీజేపీకి చెందిన వ్యక్తిని కాదు.. ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తిని కాదు. నేను కాంగ్రెస్ కు చెందిన వాడిని. మోదీ నాపై ఎంత విద్వేషాన్ని చూపించినా.. నేను మాత్రం ఆయన్ను ప్రేమతోనే ఓడిస్తా.. అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version