కేసీఆర్ జాతీయ పార్టీలో విలీనమయ్యే పార్టీలు ఇవే..!

ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలిసిందే. ఈ పార్టీ పేరు ఏంటన్న సస్పెన్స్ ఉన్నా.. దాదాపు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరునే ఖరారు చేయనున్నట్లు సమాచారం. మోదీ సర్కార్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తి.. దేశ రాజకీయాల్లో మార్పు కోరుతూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి మరికొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ పార్టీలో విలీనం అయ్యేందుకు కొన్ని పార్టీలు రెడీ అయ్యాయి.

త‌మిళ‌నాడుకు చెందిన విదుతాలై చిరుతైగ‌ల్ క‌చ్చె(వీసీకే) పార్టీని .. కేసీఆర్ కొత్త పార్టీలో విలీనం చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి వీసేక వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్‌ కూడా హైద‌రాబాద్‌కు వచ్చారు. తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావును కూడా ఆహ్వానించారు.

మరో వైపు తమ పార్టీలను కొత్త పార్టీలో విలీనం చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా కేసీఆర్ కొత్త పార్టీలో విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.