ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల…!

-

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారా అంటే నిన్న మొన్నటి వరకూ ఏవేవో ఊహాగానాలు వినిపించాయి. షర్మిల పార్టీ విలీనానికి సిద్ధమే కానీ ఆమె రాజకీయాలు తెలంగాణలోనే ఉండాలని పట్టుబడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను ఏపీకి వెళ్లాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు వైఎస్ఆర్టీపీ, కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ వారం లేదా ఈ నెలాఖరున ఈ విలీనం కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు లోటస్ పాండ్ వర్గాల సమాచారం. నిజానికి ముందుగా ఆగ‌స్టు 12న దీనికి ముహూర్తం పెట్టుకున్నా షర్మిల నిర్ణయం ఆలస్యం కావడంతో ఆ ముహూర్తానికి ఇది అమలు కాలేదు. అయితే, ఇప్పుడు ఈ స్థానంలో మరో ముహూర్తం కోసం చూస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి అన్ని చ‌ర్చ‌లు పూర్తి కాగా విలీనం వలన ఆమెకి చేకూరే ప్రయోజనాలపై కూడా చర్చలు పూర్తి అయ్యాయని తెలిసింది. షర్మిలను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపడంతో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన అనంతరం ఇద్దరు పాత కాంగ్రెస్ నేతలను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి షర్మిల మైలేజీ పెంచే ప్రణాళిక కూడా ఒకటి కాంగ్రెస్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

చేరిక‌లు, పాద‌యాత్ర‌, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు, ఇలా ప్రారంభంలో వైఎస్సార్ టీపీ అంతా బాగానే సాగింది. కానీ ఆ త‌ర్వాతే ఎక్కడో తేడా కొట్టింది. ఎంత చేసినా ప్ర‌జ‌ల్లోకి పార్టీ వెళ్ల‌లేక‌పోయింది. మ‌రోవైపు కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు. ఒకవైపు ఎంత చేసినా మైలేజీ రాకపోవడం, మరోవైపు ముంచుకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఆమె కాస్త నిరాశలో ఉంటూ వచ్చారు. ఈ తరుణంలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఈ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఈ ప్రక్రియను ఆయనే దగ్గరుండి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

పార్టీ విలీనం తరువాత ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను ప్రకటిస్తే ఆమెకి మొదటి శత్రువు అన్న జగనే. ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించింది జగన్ వైఎస్ఆర్సీపీనే. టీడీపీ క్యాడర్ టీడీపీకి ఉండగా జనసేనకి ఉన్న కొద్దిపాటి సైన్యం అంతా యువతే కనిపిస్తున్నారు. ఇక ఎటొచ్చీ వైసీపీలో కనిపిస్తున్న నేతలు, కార్యకర్తలు అందరూ పాత కాంగ్రెస్ నేతలే. కనుక షర్మిల ఇప్పుడు రాజకీయం అంటూ ఏపీలో మొదలు పెడితే మొదట టార్గెట్ చేయాల్సింది వైసీపీనే. యుద్ధం చేయాల్సింది అన్న జగన్మోహన్ రెడ్డితోనే. నిన్న మొన్నటి వరకూ ఈ విషయంపై తర్జన భర్జన పడిన షర్మిల ఇప్పుడు భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ ప్రోత్సాహంతో అన్నపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version