తెలంగాణలో పొలిటికల్‌ స్పేస్‌ లేదని షర్మిలకి అర్దమవుతుందా

-

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చర్చగా మారిన షర్మిల పార్టీ, ముందు ముందు ఎలా ఉండనుందనేది పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. షర్మిల రాజకీయాలకు కొత్త కాదు. అవగాహన లేని నేత కూడా కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలో పుట్టింది. తాత, తండ్రి, అన్న ఎటు చూసినా రాజకీయాలే. తాను కూడా స్వయంగా గత ఎన్నికల ముందు ఏపీలో క్రియాశీలకపాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా ఆమె ఫోకస్ కాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఎంట్రీ కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.


తెలంగాణలో రాజశేఖరరెడ్డి, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున ఉండటంతో పాటు..సామాజిక సమీకరణాల అంశం కూడా తనకు అనుకూలంగా ఉంటుందని షర్మిల అంచనా వేసుకుంటూ ఉంచొచ్చు. దానికి తగ్గట్టుగానే ఖమ్మం సభ జరిగిన తీరు ఉత్సాహాన్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇవేవీ ఓ రాజకీయ పార్టీ మనుగడకు పూర్తి సంకేతాలు అనుకోలేము. మీ రాజన్న బిడ్డను వచ్చాను, రాజన్న రాజ్యం తెస్తాను అంటూ వైఎస్ షర్మిల తెలంగాణా జనాల్లోకి వస్తున్నప్పుడు ఇక్కడి సమాజంలో వచ్చే కదలిక ఎంత అనేదే కీలకం. వైఎస్‌ బిడ్డగా షర్మిలకు తెలంగాణాలో ఆమెకు బ్రహ్మరధం పడతారనేది ఆమె వైపున్న అంచనా కావచ్చు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి వైఎస్ పేరు ఈ ప్రాంతంలో పెద్దగా వినిపించని పరిస్థితి ఉంది.

తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్‌ వాక్యూమ్‌ లేదు. ఇక్కడ రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో ఒక పార్టీ బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది. మరో పార్టీ కాంగ్రెస్‌ని తెలంగాణ నుంచి విడదీసి చూడలేం.
ఇక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ అత్యంత బలమైన రాజకీయ శక్తి. ఉద్యమ పార్టీగా పుట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ఇవాళ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. రెండు జాతీయ పార్టీలకు ధీటుగా జవాబు ఇస్తోంది. ఇటువంటి సమయంలో కాలుపెట్టడానికి మరో ప్రాంతీయ పార్టీకి తెలంగాణలో చోటు ఎక్కడుంది..ఇప్పుడు షర్మిల పార్టీ కూడా వస్తే… రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 4 పార్టీలు ఓట్లు పంచుకోవలసి వస్తుంది. పైగా ఇక్కడ షర్మిల ఒంటరి పోరు చేయాల్సి ఉంటుంది.

షర్మిల బిజెపితో కలవలేదు. అక్కడ ఆమెకు మత పరమైన వైరుధ్యం వస్తుంది. టీఆర్ఎస్ ఆమెను కలుపుకోదు. మొదటి నుంచి ఆ పార్టీ పైనే ఎదురుదాడి చేస్తుంది షర్మిల. జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ కాంగ్రెస్‌ లు తెలంగాణలో కలవవచ్చునేమో తప్ప, షర్మిలకు వాళ్లు చోటివ్వరు. ఇక సీపీఐ, సీపీఎంలు కూడా అయితే కాంగ్రెస్‌ తో వెళ్తాయి లేదంటే టీఆర్ఎస్ తో వెళ్తాయి తప్ప షర్మిలతో వామపక్షాల కలిసి వెళ్లడం కష్టమే. దళిత శక్తులు మొత్తం షర్మిలతో కలిసి వస్తాయని కూడా చెప్పలేం. టీఆర్ఎస్,కాంగ్రెస్‌ లకు కూడా దళిత ఓటుబ్యాంకు బలంగా ఉంది. ఇక తెలంగాణలో క్రిస్టియన్ల ప్రభావం అంతంత మాత్రమే. ఆంధ్రాతో పోలిస్తే, క్రిస్టియన్‌ మైనారిటీల ప్రభావం చాలా తక్కువ.

ముస్లింలు, ఎంఐఎంతో పాటు టీఆర్ఎస్ తో ఉన్నారు. మహా అయితే క్రిస్టియన్లలో కొద్దిశాతం షర్మిల వైపు మొగ్గు చూపవచ్చు. ఇక రెడ్ల విషయానికి వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్‌ తోనే ఎక్కువ మంది రెడ్లు పయనిస్తున్నారు. ఈ రెండు పార్టీలని వదులుకుని రెడ్లు షర్మిల వైపు వస్తారా అన్నది అనుమానమే. షర్మిల ఆశించిన స్థాయిలో రెడ్లు ఆమె వైపు మొగ్గుచూపడం కష్టమే. ఆమెను కేవలం ఓట్లు చీల్చే నేతగా చూస్తారా..లేకపోతే రాజన్న రాజ్యం తేగలిగే సత్తా ఉన్న నేతగా పరిగణిస్తారా అనేది చూడాలి. షర్మిల రాకతో ఇప్పుడు తెలంగాణలో చతుర్ముఖ పోటీ ఏర్పడింది. ఇది అధికార టీఆర్ఎస్ కే అనుకూలంగా మారనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version