తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను, లక్ష్యాలను సాధించడానికే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల అందుకనుగుణంగా కార్యాచరణ ప్రకటించారు. రాజశేఖరరెడ్డి అభిమానులు, జగన్ అభిమానులు, ఇతర పార్టీలకు చెందిన కొందరు ద్వితీయశ్రేణి నాయకులు లోటస్‌పాండ్‌వైపు పోటెత్తారు. పార్టీ ప్రకటన తర్వాత పదవుల పంపకాల గురించి, నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల గురించి కూడా చర్చలు జరిగాయి. ఇదంతా కొద్దిరోజుల క్రితం. తాజా పరిస్థితిని చూస్తే తెలంగాణలోకానీ, ఏపీలోకానీ నేతలెవరూ షర్మిల గురించి మాట్లాడటంలేదు.. పార్టీ ప్రకటన కోసం ఎవరూ ఎదురుచూడటంలేదు. ఎన్నో ఆశలు, ఆశయాలతో తెలంగాణలో పాగా వేద్దామనుకున్న షర్మిలకు ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితి.
కలుస్తామంటున్నారు.. ఫోన్‌లో
తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని ఆలోచిస్తోన్న షర్మిల ఇప్పుడు ఆ దిశగా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎవరెవరో వచ్చి కలిసెళుతున్నారుకానీ పేరెన్నికగన్న నేతలుకానీ, నాయకులుకానీ, కనీసం ఒక మాజీ ఎమ్మెల్యే కూడా షర్మిలను ఇంతవరకు కలవలేదు. ఏపీలో జగన్ సీఎం కావాలని నాడు రాష్ట్రమంతా పర్యటించారు. ఇప్పుడు తెలంగాణ కోడలు అని చెప్పి లోటస్ పాండ్ లో వరుస సమావేశాలు పెడుతున్నారు కానీ తెలంగాణలో ఆమె పార్టీకి స్పందన రావడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉండి ఎటువంటి పదవులు లేని నేతలు కూడా ఇటువైపు తొంగి చూడటంలేదు. షర్మిల కార్యాలయం నుంచి ఫోన్లు వెళుతున్నా కలుస్తామని చెబుతున్నారేకానీ ఒక్కరు కూడా కలిసిరావడంలేదు.
ఏం చేస్తారో చూద్దాం…
షర్మిలకు తెలంగాణ మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోలేదనే అనుమానాలు అన్ని పార్టీల నేతల్లో వ్యక్తమవున్నాయి. టీఆర్ ఎస్‌ను షర్మిల పట్టించుకుంటున్నప్పటికీ ఆ పార్టీ అసలు పట్టించుకోవడంలేదు. మొదట్లో హరీష్‌రావు ఒకటి రెండు విమర్శలు చేసి సరిపెట్టారు. తాజాగా మంత్రి అజయ్ కూడా విమర్శించారు. భారతీయ జనతాపార్టీ అసలు పట్టించుకోవడంలేదు. పార్టీ పెడతానని ప్రకటించినప్పుడు రేవంత్‌రెడ్డి షర్మిలను టార్గెట్ చేశారుకానీ తర్వాత కాంగ్రెస్ పార్టీవారెవరూ షర్మిలను సీరియస్‌గా తీసుకోవడంలేదు. పాత కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్లుగా ఉందేకానీ కొత్తపార్టీగా కనపడటంలేదని కాంగ్రెస్‌పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పాతవారిని తీసుకోవడంవల్ల ఆయా నియోజకవర్గాల్లో వారికున్న బలం పార్టీ బలమవుతుందని ఆలోచించిన షర్మిల తప్పుచేశారేమోననిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారో? రాజన్య రాజ్యాన్ని ఎలా స్థాపిస్తారో వేచిచూద్దాం!!