హైదరాబాద్ వైపే ప్రపంచం చూపు : మంత్రి కేటీఆర్

-

హైదరాబాద్: ప్రపంచ దేశాల చూపు హైదరాబాద్ వైపే ఉన్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని.. భవిష్యత్‌లో ప్రపంచ జనాభాకి టీకాలను అందించే స్థాయికి హైదరాబాద్ ఎదుగుతుందన్నారు. 60కి పైగా దేశాల రాయబారుల సందర్శనతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ జినోమ్ వ్యాలీని సందర్శించడంతో నగర ప్రాధాన్యత పెరిగిందన్నారు. కరోనా ప్రభావం ఉన్నా.. 2020-21 సంవత్సరంలో జీవ శాస్త్రాల రంగంలో రూ.3,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. రూ.7.50 లక్షల కోట్ల పెట్టుబడులను పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

ప్రపంచస్థాయి జౌషధనగరి, జీవ ఔషధ పరిశ్రమల సౌకర్యాల కేంద్రం బీహబ్‌ను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన బయో ఆసియా అంతర్జాతీయ సదస్సుకు హాజరై ప్రారంభించారు. కరోనా నివారణ కోసం కోవాగ్జిన్ టీకా అభివృద్ధికి కృషి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు జినోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా ప్రపంచ మానవాళిపై పెను ప్రభావం చూపిందన్నారు. ఈ మహమ్మారి వల్ల 24.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. విపత్కర పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని.. భారత్ బయోటెక్ దేశీయ టీకాను ఉత్పత్తి చేసి ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. బయోలాజికల్-ఈ, ఇండియన్ ఇమ్యూనోలాజికల్ టీకాల అభివృద్ధికి కృషి చేయడం గర్వ కారణమన్నారు. హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ఆధ్వర్యంలో రష్యన్ టీకా ‘స్పుత్నిక్’ తయారీ చేపట్టాయని, అరబిందో ఫార్మా 450 మిలియన్ డోసుల సామర్థ్యంతో ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని 10 ప్రధాన ఔషధాల్లో 10 జినోమ్ వ్యాలీలోనే ఉత్పత్తి అవుతున్నాయి. త్వరలో హైదరాబాద్‌లో జీవ ఔషధ పరిశ్రమల సౌకర్యాల సంస్థ బీహబ్‌ను ప్రారంభిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version