టీడీపీ కార్యకర్తకు మహానాడు మిగిల్చిన ప్రశ్నలు ఇవి!

-

మహానాడు అంటే పసుపు పండుగ, పసుపు జెండా పండుగ, వేల సంఖ్యలో కార్యకర్తలు కలిసి ఒకేచోట భోజనాలు చేసే కార్యక్రమం, ఆత్మస్థుతి – పరనిందల కాలక్షేప వేడుక, ప్రెస్ మీట్ విమర్శల వేదిక… కాదు! పార్టీ అంత‌ర్మ‌థ‌నం, భవిష్యత్తుపై మేధోమ‌థ‌నం!! కానీ తాజాగా జరిగిన ఆన్ లైన్ మహానాడులో జరిగిందేమిటి? అధికారపక్షం అన్నదని కాదు.. విశ్లేషకులు ఖండించారని కాదు.. అభిమానులు బాదపడ్డారని కాదు.. ఒక్కసారి టీడీపీని నిజంగా అభిమానించే ప్రతీ నేత, ప్రతీ కార్యకర్త ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది! జగన్ ను తిట్టడానికి, ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రెస్ మీట్ లు చాలు, జూం యాప్ లలో కాంఫరెన్స్ లు చాలు! కానీ… ఇంత మహావేదిక సాక్షిగా పార్టీ భవిష్యత్తుపై కార్యకర్తలకు బాబు ఇచ్చిన భరోసా ఏమిటి?

అవును ప్రస్తుతం అసలు సిసలు టీడీపీ కార్యకర్త మదిలో మెదులుతున్న ప్రశ్నలివే:

  • మహానాడు ఆన్ లైన్ కార్యక్రమం సగటు టీడీపీ కార్యకర్తకు ఇచ్చిన మెసేజ్ ఏమిటి?
  • కార్యకర్తలే నాకు దేవుళ్లు, పార్టీకి వెన్నుపూసలు అన్న మాట తప్ప… వారికి ఇచ్చిన భరోసా ఏమిటి.. భవిష్యత్తుపై కలిగించిన నమ్మకం ఏమిటి?
  • 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ సీట్ల‌కు గాను కేవ‌లం 23 సీట్ల‌లో మాత్ర‌మే టీడీపీ గెలుపొందడం పట్ల పార్టీ చేసుకున్న ఆత్మవిమర్శ ఏమిటి? ఆ వినాశనంలో ఎవరి వాటా ఎంత?
  • ఆ ఎన్నికల్లో పార్టీ అంతదారుణంగా ఓడిపోవడానికి టీడీపీ నుంచి ఎవరూ కారణం కాదు.. కేవలం ఓటర్లే కారణం అని సరిపెట్టుకుంటున్నారా?
  • ఐదేళ్ల పాల‌న‌ అనంతరం 23 సీట్లకు పార్టీ పరిస్థితి పడిపోవడం… ఇవాలో రేపో ప్రతిపక్ష హోదా పోయే పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుండటం ఎవరి పాపం?
  • జరిగిందేదో జరిగింది అని సరిపెట్టుకుంటూ… ఇకపై ఎలాంటి ఆలోచనలతో పార్టీ ముందుకు వెళ్లబోతుంది?
  • జగన్ పైనా ప్రభుత్వం పైనా విమర్శలు మాత్రమే చేయడం వల్ల ప్రస్తుతం పార్టీకి ఒరిగేది ఏముంటుంది?
  • ఈ తరుణంలో ఇంతకాలం టీడీపీకి అనుకూలంగా ఉన్న వర్గాలను ఎలా తిరిగి సంపాదించుకోవాలి?
  • వారి మెప్పు పొందాలంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పద్దతులు అవలంబించాలి?
  • జనాలకు ప్రతిపక్షం ఉందనే నమ్మకం ఎలా కలిగించాలి?

రెండు రోజులపాటు జరిగిన ఈ మహానాడులో పార్టీ భవిష్యత్తు గురించిన ఒక్క అర్థవంతమైన చర్చా జరగలేదు అనేది సగటు కార్యకర్త బాధ! మొదటిరోజు తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడే సగటు టీడీపీ కార్యకర్తకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది! పత్రికల్లో ప్రభుత్వాలపై వచ్చే కొన్ని విమర్శల శీర్షికలే వాటిలో కనిపించడంతోనే వారి బాధ మొదలైంది! రెండు రోజుల ఆన్ లైన్ మహానాడు సగటు టీడీపీ కార్యకర్తకు మిగిల్చిన ఈ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయా? మళ్లీ ఇంకో ప్రశ్న!!

Read more RELATED
Recommended to you

Exit mobile version