ప్రస్తుత క్లిష్ట సమయంలో టీడీపీ అధినేతకు ఇది చాలా పెద్ద ఉపశమనమనే చెప్పాలి. నిన్నమొన్నటివరకూ ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టీడీపీని వీడుతున్నారని, వైకాపా గూటికి చేరుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఇంతకాలం ఏమి ఆలోచించుకున్నారో లేక క్లారిటీ రావడానికి టైం పట్టిందో ఏమో కానీ… తాజాగా సాంబశివరావు మైకులముందుకు వచ్చారు! తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తాను టీడీపీని వీడేది లేదని వెల్లడించారు! దీంతో కారణం ఏదైనా.. “పర్చూరు” సేఫ్ అనే మాటలు టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్నాయి!
చాలా రోజులుగా ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టీడీపీ కండువాను భారంగా భావిస్తున్నారని, ఆ కండువాను తీసి పారెయ్యాలనుకుంటున్నారని… ఈ మేరకు ఆయన ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశమై మాట్లాడారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంతకాలం మౌనంగా ఉండి బాబు & కోలను టెన్షన్ కి గురిచేసిన సాంబశివరావు తాజాగా శుభవార్త చెప్పారు! ఈ వ్యవహారంపై పార్టీ ముఖ్య కార్యకర్తలు, అనుచరులు, అభిమానులతో సమావేశమైన ఆయన… మరోసారి నిశితంగా చర్చించి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీని వీడతున్నారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు.
ఈ ప్రచారాలు వచ్చి చాలా రోజులే అయినా… అవి నిజంగా రూమర్స్ అయితే నాడే స్పందించి ఉండొచ్చు కదా సాంబశివరావు గారూ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వెలువడుతున్నాయి! ఈ ప్రచారాలు వచ్చిన మొదటి రోజునే ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే… మహానాడు వేడుకల్లో మీరు అద్భుతంగా ప్రసంగించి ఉండేవారు, శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించేవారు కదా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు! “బేరాలు తెగలేదేమో.. బందాలు విడలేదు” అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు! ఏది ఏమైనా… పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు… ఈ సమయంలో బాబు నెత్తిన పాలుపోసినట్లే!!
సాంబశివరావు సంగతి అలా ఉంటే… ఈ ప్రచారాల్లో ఇదేస్థాయిలో బలంగా వినిపించిన పేరు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్! వీరిద్దరి పేర్లు కలిపే గతకొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై వైకాపా నుంచి ఇంకా క్లారిటీ రాలేదో ఏమో కానీ… సత్య ప్రసాద్ మాత్రం ఇంకా బాబుకు గుడ్ న్యూస్ చెప్పాలేదు! మరి కాస్త టైం తీసుకుని అయినా… సత్య ప్రసాద్, బాబుకు గుడ్ న్యూస్ చెబుతారా లేక సాంబశివరావు ఇచ్చిన సంతోషాన్ని నాలుగు రోజులు కూడా లేకుండా చేస్తారా అనేది వేచి చూడాలి!