కేంద్రంతో కయ్యాలు ఎలా ఉన్నా కూడా కొన్ని నిజాలు మాత్రం మాట్లాడుతూ వెళ్లాలి. తెలంగాణ రాష్ట్ర సర్కారు కోరుకున్న విధంగా కేంద్రం అయితే రాష్ట్రాలకు సాయం చేయడం లేదు. ఆ మాటకు వస్తే నిధుల విడుదలలో ఉదారవాదం అయితే లేదు. రాష్ట్రాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలలో అనవసరం అయిన ఆంక్షలేవో పెడుతోంది. కొంతకాలానికి దేశ వ్యాప్తంగా ఒకే విధం అయిన పవర్ పాలసీలను కూడా అమలు చేసే అవకాశాలున్నాయి. అవే కనుక జరిగే అవకాశాలుంటే అప్పుడు వ్యవసాయానికి విద్యుత్ అన్నది ఉచిత రూపంలో అందించేందుకు వీలుండదు.
అదేవిధంగా కొన్ని పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలపై కూడా కేంద్రం కొరడా ఝుళిపించడం ఖాయం. ఈ నేపథ్యంలో బొగ్గు కొనుగోలు లేదా సంబంధిత అవసరాలను తీర్చుకునే క్రమంలో రాష్ట్రాలను కేంద్రం కట్టడి చేస్తోంది అన్న విమర్శ ఒకటి తెలంగాణ సర్కారు చేస్తోంది. దీంతో తమకు ఆర్థిక భారం పెరిగిపోతోందని కూడా అంటోంది. పోనీ సోలార్ పవర్ కొనుగోలు చేద్దామన్నా అక్కడ కూడా కార్పొరేట్ లాబీయింగ్ దృష్ట్యా కేంద్రం చెప్పిన విధంగానే ముందుకు పోవాల్సి వస్తుందన్న వాదనలూ ఉన్నాయి. అంటే విద్యుత్ కొనుగోలు బహిరంగ మార్కెట్ లో ఒకరి ఆదేశాలకు అనుగుణంగానే సాగిపోతుంది అన్నది వాస్తవం. ఇదే సమయంలో బొగ్గు కొనుగోలు కూడా !
మనకు విస్తారమైన బొగ్గుగనులు ఉన్నప్పటికీ.. ఇక్కడి వనరులను వినియోగించుకోకుండా ప్రైవేట్ సంస్థల నుంచి టన్నుకు రూ.30 వేలకు లభించే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని బలవంతం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. అని అంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ నేపథ్యాన బండి సంజయ్ కూడా ఓ మాట చెబుతున్నారు. బొగ్గు కొనుగోళ్ల విషయమై అధికార పార్టీ జనాలకు తప్పుడు సమాచారం ఇస్తోందని? ఇంతకూ ఎవరు రైటు ! ఎవరు రాంగు? కన్ ఫ్యూజ్ చేయకండి.
విస్తారం అయిన స్థితిలో బొగ్గు నిల్వలు మనకే ఉన్నాయి. తవ్వకుండా మిగిలిపోయిన గనులు చాలా ఉన్నాయి. వీలుంటే కాస్త ఒడిశా వైపు, ఇంకా వీలుంటే ఛత్తీస్ గఢ్ వైపు కన్నేసి చూడండి. ఏం కాదు .. ఝార్ఖండ్ లోనూ బొగ్గు గనులు ఉన్నాయని, వాటిని కూడా తవ్వకుంటే ఎవ్వరేం చేయలేరని విమర్శ ఒకటి వినిపిస్తోంది. ఇంతగా బొగ్గు మనకు అందుబాటులో ఉన్నా, సింగరేణి దగ్గర కూడా కావాల్సినంత బొగ్గు ఉన్నా ఎందుకని అదానీ ప్రేమలో బీజేపీ ఉందని ఓ ప్రశ్న వినిపిస్తోంది. విదేశాలకు సంబంధిత కంపెనీలకు కొమ్ముకాసే బదులు దేశీయ కంపెనీలకు ఎందుకు ప్రోత్సాహం అందించరని ప్రశ్నిస్తోంది.
ఈ నేపథ్యంలో బొగ్గు కొరత తీవ్రతరం అయితే వచ్చే కాలంలో అనగా ఆగస్టులో ఇంకా చెప్పాలంటే వాన కాలం ఆరంభంలోనే కరెంటు కష్టాలు ఉంటాయని ప్రధాన మీడియా హెచ్చరిస్తోంది.ఈ పాటి కోతలు లేని సర్కారును తామెందుకు అందించలేమని కేంద్రం చెప్పుకునేందుకు ఓ అవకాశం దక్కేలా పరిణామాలు ఉండనున్నాయని కొన్ని మీడియాలు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిస్తున్నాయి. నాలుగు వానలు పడితే జలవిద్యుత్ కావాల్సినంత ఉత్పత్తి చేసుకోవచ్చు కనుక ఇప్పటికిప్పుడు బొగ్గు కొనుగోలుకు వచ్చిన తొందరేం లేదన్న వాదన ఒకటి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వస్తున్నాయి. మరోవైపు సింగరేణి డబ్బులను కూడా కేసీఆర్ మిస్ యూజ్ చేస్తున్నారని బండి ఆరోపిస్తున్నారు. అది నిజమో కాదో తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పాలి.