మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా మునుగోడులో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే గులాబీ పార్టీ ప్రధాన నేతలంతా మునుగోడు నియోజకవర్గంలో దిగారు.
తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మునుగోడు నియోజకవర్గంలోని చేనేత కార్మికులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చేనేత కార్మికులు ఉప ఎన్నికల్లో ఓటుతో బీజేపీకి బుద్ధి చెప్పాలని సూచించారు. చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీయేనని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు.
పొదుపు, బీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన బీజేపీకి మునుగోడు ఉపఎన్నిక ఫలితంతో బుద్ధి చెప్పాలని కేటీఆర్ నేతన్నలకు సూచించారు. నేతన్నల భవిష్యత్‌ను బీజేపీ అగమ్యగోచరంగా మారుస్తోందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా బడ్జెట్ ఇచ్చి నేతన్నలను ఆదుకుంటోందని కేటీఆర్ స్పష్టం చేశారు.