ఏప్రిల్ నాలుగో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.
గత ఆరు నెలల నుంచి తెలంగాణ ఓటరుకు ఉన్న డిమాండ్ ఏ ఓటరుకూ లేదు. అసెంబ్లీ ఎన్నికలతో మొదలు ఇప్పటికి మూడు సార్లు ఓటేశాడు తెలంగాణ ఓటరు. అంతటితో అయిపోయిందా అంటే లేదు. మళ్లీ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. లోక్ సభ ఎన్నికలు అయిపోయాయో లేదో తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఎన్నికల తేదీలను కూడా ఖరారు చేసి ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపింది.
ఏప్రిల్ నాలుగో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న 5857 ఎంపీటీసీ స్థానాలకు, 535 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల తర్వాత మండల, జిల్లా పరిషత్ చైర్మన్లను ఎన్నుకుంటారు. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను కూడా ఇప్పటికే ఖరారు చేసింది. అయితే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను మాత్రం లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాతనే విడుదల చేయనున్నారు.
మొదటిదశ పోలింగ్ మే 6న ఉంటుంది. దానికి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 22 నుంచి 24 వరకు, నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 25 న. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 28.
రెండో దశ పోలింగ్ మే 10 న జరుగుతుంది. దానికి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 26 నుంచి 28 వరకు, నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 29న, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 2.
మూడో దశ పోలింగ్ మే 14 న ప్రారంభం కానుండగా… నామినేషన్ల స్వీకరణ తేదీ ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు, నామినేషన్ల పరిశీలన తేదీ మే 3, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 6.