‘బండి’ దెబ్బకు ‘కారు’ రివర్స్…నల్గొండలో కూడా బీజేపీని లేపుతున్నారుగా!

-

ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బడా బడా నేతలు ఉన్నారు. దీంతో ఈ జిల్లాలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ హవా కొనసాగుతూ వస్తుంది. తెలంగాణ విడిపోయాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా నల్గొండలో కాంగ్రెస్ సత్తా చాటింది. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నల్గొండలో కాంగ్రెస్‌ని వీక్ చేస్తూ వచ్చింది. 2018 ఎన్నికల్లో మరింతగా దెబ్బకొట్టింది.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

ఇప్పుడు ఉమ్మడి నల్గొండలో గులాబీ పార్టీదే ఆధిక్యం. అయితే ఇక్కడ బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. ఒక ఎం‌పి‌టి‌సి కూడా గెలిచే బలం బీజేపీకి లేదు. ఇంకాస్త కాంగ్రెస్‌కే బలం ఉంది. అసలు ఏ మాత్రం బలం లేని నల్గొండలో కమలం పార్టీని గులాబీ పార్టీ పైకి లేపే ప్రయత్నాలు చేస్తుంది. ధాన్యం కొనుగోలు అంశంపై పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో మిల్లు వద్ద రైతులతో మాట్లాడే కార్యక్రమం చేశారు.

అదే సమయంలో అక్కడకు టీఆర్ఎస్ నేతలు కూడా భారీగా వచ్చి, బీజేపీకి పోటీగా నినాదాలు చేశారు. బండి గో బ్యాక్ అంటూ నల్ల జెండాలతో ఆందోళన చేశారు. అటు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జగదీష్ రెడ్డిలు బండి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. బండి కార్లలో గుండాలని తీసుకొచ్చి రైతులపై దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు.

అయితే బండి పర్యటన ఉన్నప్పుడు..అక్కడ టీఆర్ఎస్ శ్రేణులకు అనుమతి ఎలా వచ్చిందని బీజేపీ ప్రశ్నిస్తుంది. టీఆర్ఎస్ శ్రేణులు అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, రైతులపై రాళ్ళ దాడి చేశారని బండి చెబుతున్నారు. అయినా అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్…ప్రతిపక్షం మాదిరిగా ఆందోళనలు చేయడం ఏంటో అర్ధం కావడం లేదు. ఏదో బండి వచ్చి రైతులతో మాట్లాడి వెళ్లిపోయే వారు…కానీ అక్కడకెళ్లి టీఆర్ఎస్ వెళ్ళి హడావిడి చేసి బండిని ఇంకా హైలైట్ చేశారు. ఇటు టీఆర్ఎస్ నేతలు విమర్శలు చూస్తుంటే నల్గొండ జిల్లాలో కూడా బీజేపీ బలోపేతం అవుతుందని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి నల్గొండ జిల్లాలో వీక్‌గా ఉన్న బీజేపీని పైకి లేపేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version