పెనుకొండలో ఆశక్తికరంగా మహిళల మధ్య పోరు

-

అనంతపురం జిల్లాలో పెనుకొండ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బరిలో దిగుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థిని బట్టి అభ్యర్థుల మార్పు చేస్తుండటంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇన్నాళ్లూ పెనుకొండలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పార్థసారథికే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా మంత్రి ఉషశ్రీని పెనుకొండ ఇంచార్జ్ గా నియమించడంతో టీడీపీ కూడా అభ్యర్థిని మార్చాల్సి వస్తోంది.

ఇక్కడ ఉషశ్రీకి పోటీగా ఆమె సామాజిక వర్గానికే చెందిన సవితమ్మను బరిలోకి దింపనుంది తెలుగుదేశం పార్టీ.దీంతో అందరి చూపు పెనుకొండ నియోజకవర్గం వైపు మళ్లింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథితో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ టికెట్ ఆశించారు. అయితే.. చంద్రబాబు మాత్రం పార్థసారథికే అవకాశం కల్పిస్తారన్న చర్చ జోరందుకుంది.

కల్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీని పెనుకొండ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో ఉషశ్రీకి పోటీగా సవితమ్మను రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ.వీరిద్దరూ కురబ సామాజికవర్గమే కావడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.సవితమ్మ స్థానికురాలు కావడం, చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆమెకు కలిసివచ్చే అంశాలు. ఉషశ్రీ విషయంలో స్థానికత ప్రధాన భూమిక పోషించనుండగా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు.

స్థానికత అంశం తెరపైకి రాకుండా ఉండేందుకు ఇప్పటికే పెనుకొండలో సొంత ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారామె. ఇక వైసీపీలో ఉన్న గ్రూపులన్నంటినీ ఒక తాటిపైకి తీసుకువస్తూనే టీడీపీలో ఉన్న వర్గ విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తంగా పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య పోరు ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version