ఒక్క పరిణామం.. ఏ రాజకీయ పార్టీకైనా ఊపు ఉత్సాహం కల్పిస్తుంది. అదే పరిణామం.. నిలువునా కుంగ దీస్తుంది. పార్టీపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తుంది. ఇప్పటికే పెను ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకి ఇప్పుడు మరో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. పార్టీని నమ్ముకుని ఉన్నవారిని చంద్రబాబు పట్టించుకోడని, ఆయనను నమ్ముకోవడం వృథా అని ఇప్పటికే పార్టీ నుంచి దూర మైన నాయకులు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పటికీ పార్టీలో ఉన్నప్పటికీ.. సీబీఐ సహా ఐటీ, పోలీసు కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా పార్టీ తమకు అండగా నిలవడం లేదనే వాదనను బలంగా వినిపిస్తున్నారు. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ కాకినాడ అప్పటి ఎంపీ తోట నరసింహం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
తాను తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే.. తమను పలకరించిన తమ్ముడు ఒక్కడూ లేరని, చంద్రబాబు ఆయన కుమారుడు కూడా ఇదే తరహాలో నాటకం ఆడారని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇటీవల గనుల కేసుల్లో చిక్కుకున్న కొందరు నాయకులు కూడా బాబు వైఖరిని అంతర్గత సమావేశాల్లో తప్పుపట్టారు. పన్నెత్తు పలకరింపునకు కూడా తాము నోచుకోలేక పోయామని అన్నారు. దీంతో చంద్రబాబు వైఖరిపై సర్వత్రా పార్టీలోనే నిరాశ, నిస్పృహలు వస్తున్నాయి. తాజాగా కర్నూలులోనూ ఇదే తరహా పరిస్థితి ఎదురైంది. సీనియర్ మోస్ట్ నాయకుడు, గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. భరించి పార్టీ కోసం నిలబడిన నాయకుడు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆత్మహత్య ప్రయత్నం చేయడం, దీనికి చంద్రబాబు కారణమని ఆయన కుమారుడు ఆరోపించడం పెను సంచలనం సృష్టించింది.
ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ చంద్రబాబు ఆశీస్సుల కోసం శ్రమించిన ఆ పార్టీ నేత బంగి అనంతయ్య.. చంద్రబాబుకు వీరాభిమాని. 1995 నుంచి 2000 వరకు కర్నూలు మేయర్గా పనిచేశారు. ఈ క్రమంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. మేయర్గా ఉన్నప్పటికీ.. ఆయన ఒక్క రూపాయి కూడా వెనుకేసుకోలేదు. పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముకున్నారని ఆయన కుమారుడు ఆధారాలతో సహా చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబును కలిసి కొంతైనా ఆర్థిక సాయం చేయాలని అప్పుల నుంచి తేరుకుంటానని ప్రాథేయ పడ్డారట.
అయితే, చంద్రబాబు మాత్రం రేపురా, మాపురా చూద్దాం అంటూ కాలక్షేపం చేయడంతో మానసికంగా తీవ్ర ఆవేదనకు గురైన బంగి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్ల తీవ్రంగా నష్టపోయానంటూ సూసైడ్ నోట్ రాశారు.అంతేకాదు, తనకు ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ పదవి ఇస్తానని నమ్మించి మోసం చేశారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా తన ఎదుగుదలను దెబ్బతీశారంటూ సూసైడ్ నోట్లో రాశారు. ఈ పరిణామం.. జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇదే కొనసాగితే.. పార్టీలో ఎవరూ ఉండరని నాయకులు పరోక్షంగా ఇప్పటికే బాబుకు హెచ్చరికలు పంపారు.