2014 ఎన్నికల సమయంలో వివేక్ టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ సాధించి బాల్క సుమన్ పై పోటీ చేశారు. కానీ.. అప్పుడు వివేక్ ఓడిపోయారు. తర్వాత మళ్లీ టీఆర్ఎస్ లో చేరారు..
త్వరలో తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలకు కైవసం చేసుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ చాలా కసరత్తు చేస్తోంది. అందుకే టికెట్ల విషయంలోనూ అస్సలు కాంప్రమైజ్ కాలేదు. సీఎం కేసీఆర్ ఎవరి అంచనాలకూ అందకుండా లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. గెలుపు గుర్రాలు అని అనుకున్న వారికే టికెట్ దక్కింది.
అయితే.. టికెట్ల విషయంలో సీఎం కేసీఆర్ ఆచీతూచీ ఆలోచించారు. కొందరు సిట్టింగ్ లకు టికెట్లు కేటాయించి మరికొందరు సిట్టింగ్ లకు కేసీఆర్ మొండి చేయి చూపించారు. మరోవైపు టికెట్ పై ఆశలు పెట్టుకున్న మరికొందరికి కూడా కేసీఆర్ హ్యాండిచ్చారు.
అలా.. కేసీఆర్ హ్యాండిచ్చిన వారిలో మొదటి వ్యక్తి వివేక్. వివేక్ కు టికెట్ ఇవ్వొద్దని పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారట. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదట. అయితే.. పెద్దపల్లి నియోజకవర్గంలో వివేక్ పై కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయనకు టికెట్ దక్కుతుందని అంతా భావించారు. తనకు టికెట్ కన్ఫర్మ్ అని ఆయన కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్న తరుణంలో కేసీఆర్.. వివేక్ కు సీటు కేటాయించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను కూడా సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సోదరుడికి టికెట్ ఇవ్వకపోవడం, దీంతో వివేక్ తన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రచారం చేసి.. ప్రత్యర్థులు గెలిచేందుకు ఫండ్స్ ఇచ్చారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు వెళ్లింది. చివరి వరకు వివేక్ టికెట్ విషయంలో పునరాలోచించిన కేసీఆర్.. ఎమ్మెల్యేలు వివేక్ కు టికెట్ ఇవ్వొద్దంటూ బల్లగుద్దిమరీ చెప్పడంతో చేసేది లేక వేరే వ్యక్తికి టికెట్ ఖరారు చేశారంటూ ప్రచారం జరుగుతోంది.