ఢిల్లీ కి మళ్లీ మళ్లీ ! పిసిసి పీఠం కోమటిరెడ్డికేనా  ?

-

తెలంగాణ పిసిసి అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది అనేది స్పష్టంగా కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆశావాహులు ఢిల్లీ స్థాయిలో తమ పలుకుబడి ఉపయోగించి అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తూనే వస్తున్నారు . ఇక కాంగ్రెస్ అధిష్టానం సైతం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక తర్జనభర్జన పడుతోంది. పిసిసి పీఠం పై తమకే దక్కుతుంది అని సీనియర్ నాయకులంతా ఆశలు పెట్టుకున్నారు. అలాగే టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం యాక్టివ్ గా కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టి ముందుకు తీసుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి సైతం ఈ పదవి తనకే  వరిస్తుందని, అధిష్టానం తమను తప్పకుండా గుర్తిస్తుందనే ధీమాతో ఉన్నారు.

కానీ మిగతా సీనియర్ నాయకులంతా ఆ పదవి రేవంత్ కు దక్కకుండా చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క, తూర్పు జగ్గారెడ్డి ఇలా చాలా మంది పిసిసి పీఠం కోసం పోటీ పడుతూ, తమలో ఎవరికి ఈ పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని, కానీ రేవంత్ కు మాత్రం పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు వీల్లేదు అంటూ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ అధిష్టానానికి నివేదిక ఇచ్చినా, వారు దీనిపై ప్రకటన చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఎవరు పేరు ప్రకటించినా జరగబోయే నష్టం ఎంత ఉంటుందో కాంగ్రెస్ అధిష్టానం కు స్పష్టంగా తెలుసు. ఇదిలా ఉంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్ ను కలిశారు. అదే రోజున కోమటిరెడ్డి వెంకట రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్లి పిసిసి అధ్యక్ష పీఠం గురించి చర్చించారు. ఇది ఇలా ఉంటే అకస్మాత్తుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లడంతో పిసిసి అధ్యక్ష పదవి ఆయనకే అనే ప్రచారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురు పేర్లను ఫైనల్ చేసిందట. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ఆ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అధిష్టానానికి సమర్పించిన నివేదికలో ఎక్కువగా పార్టీ నాయకులు రేవంత్ కు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీనియర్ కోటాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి,భట్టివిక్రమార్క పేర్లను అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్ష పదవిపై ఈనెల 26న ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎవరికి పిసిసి అధ్యక్ష పీఠం దక్కినా, మిగతా వారు అసంతృప్తికి గురి కాకుండా చూసుకునే విషయంపైనే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version