ఆంధ్రప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు తెలంగాణ నెత్తిన పాలు పోస్తున్నాయి అనే వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలో రాజధాని మార్పు, స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అనే చట్టం వంటివి తెలంగాణకు కలిసి వచ్చాయి అనేది వాస్తవం. గత అయిదేళ్ళుగా తెలంగాణలో కాస్త రియల్ ఎస్టేట్ రంగం అనేది వెనుకబడి ఉంది. నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
తెలంగాణ అనే కాదు గాని దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితులు రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసాయి అనేది వాస్తవం. రాజకీయ కారణాలు కూడా తోడు కావడంతో అది కాస్త వెనుకబడింది అనే చెప్పుకోవచ్చు. ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో తెలంగాణ వైపు తక్షణమే పెట్టుబడి పెట్టె కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపార౦ వంటివి ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయాయి. దీనితో హైదరాబాద్ లో రియల్ భూం అనేది కొన్ని రోజులుగా పెరిగింది.
దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. శనివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు, రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ లో మెరుగుపడిందని, గత అయిదేళ్ళ కంటే ఇప్పుడు ఎక్కువగా లాభపడింది అంటూ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కూడా కలిసి వచ్చాయని వ్యాఖ్యానించారు. వెరసి హైదరాబాద్ సహా తెలంగాణలో రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి. నెల రోజులుగా తెలంగాణలో భూముల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.